Revanth Reddy | యాదాద్రి భువనగిరి : మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఇవాళ్టి పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది అని స్పష్టం చేశారు. మూసీ వెంట పాదయాత్ర చేద్దామన్న హరీష్ రావు సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. జనవరి నెలలో వాడపల్లి నుండి పాదయాత్ర చేద్దాం. పాదయాత్రకు రెడీగా ఉండాలని బిల్లారంగాలకు సవాల్ విసురుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. బిల్లారంగాలు రావాలి.. మిమ్మల్ని ఇక్కడి ప్రజలు రానిస్తారో.. నడుముకు తాడుకట్టి మూసీలో ముంచేస్తారో చూద్దామని రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ వెంట పాదయాత్ర అనంతరం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడారు.
ఒకనాడు మంచి నీటిని అందించిన మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారి విషాన్ని చిమ్ముతోందన్నారు. పాలకులు పగ పట్టారా.. దేవుడు శాపం పెట్టిండా అని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు బాధపడుతున్నారు. మూసీ పునరుజ్జీవింప చేయాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదు.. ఇక్కడి చెరువుల్లో చేపలు బతికే పరిస్థితి లేదు. ఇక్కడ పండిన పంటలను తినే పరిస్థితి లేదు.. ఇక్కడ పశువుల పాలు తాగాలన్నా ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హరీష్ రావు సవాల్‌ను స్వీకరించిన రేవంత్ రెడ్డి
జనవరి నెలలో వాడపల్లి నుండి పాదయాత్ర చేద్దాం. హరీష్ రావు, కేటీఆర్ పాదయాత్రకు రెడీగా ఉండండి – రేవంత్ రెడ్డి https://t.co/8vEgLTwd8e pic.twitter.com/qpXC7Hrt8V
— Telugu Scribe (@TeluguScribe) November 8, 2024
పాడిపంటలతో ఎంతో సంతోషంగా బతికిన ఇక్కడి ప్రజలు.. ఇపుడు భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆరెస్ నేతలకు దోచుకోవడమే తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదు.. అందుకే మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని అడ్డుకోవాలని చూస్తున్నారు. మూసీ ప్రక్షాళనకు అండగా ఉంటామని చెప్పిన కమ్యూనిస్టు సోదరులకు ధన్యవాదాలు. మూసీ కాలుష్యంతో ఇక్కడి ప్రజలు అణుబాంబు కంటే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు. వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారుతోంది. అందుకే మూసీ ప్రక్షాళన చేయాలో లేదో ఒక్కసారి ఆలోచించండి అని రేవంత్ రెడ్డి సూచించారు.
మోదీ గుజరాత్‌ను బాగు చేసుకోవచ్చు కానీ మేం మూసీని బాగుచేసుకోవద్దా.. ఇది నా జన్మదినం కాదు… ఇక్కడికి రావడంతో నా జన్మ ధన్యమైంది. సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నా.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం.. బుల్డోజర్లకు అడ్డు పడతామంటున్న వాళ్లు వాళ్ల పేర్లు ఇవ్వండి… మా నల్లగొండ ప్రజలతో వచ్చి మీపై బుల్డోజర్లు తీసుకెళ్లకపోతే నేను పేరు మార్చుకుంటా.. బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లా రంగాలు.. ధైర్యం ఉంటే తారీఖు చెప్పండి.. మా వెంకన్నను బుల్డోజర్ పై ఎక్కిస్తా… మా ఎమ్మెల్యే సామెల్‌తో జెండా ఊపిస్తా.. అందర్నీ పండబెట్టి తొక్కుతా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మూడు నెలలు జైలుకు పోతేనే నీకు దుఃఖం వస్తే… మూసీ పరివాహక బిడ్డల జీవితాలు పోతుంటే నీకు పట్టదా? నల్లగొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదనా కేసీఆర్..? మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నావ్. నల్లగొండ జిల్లా పౌరుషాల గడ్డ… మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారు.. వాళ్ల అవినీతి కోసం, వాళ్ల దోపిడీ కోసం మూసీని అడ్డుకోవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.