Site icon vidhaatha

Revanth Reddy | రామోజీ రావు లేని లోటు ఎప్ప‌టికీ పూడ్చ‌లేనిది : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy | హైద‌రాబాద్ : తెలుగు పత్రికా దిగ్గజం, ఈనాడు గ్రూప్స్ అధినేత, పద్మవిభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు.

తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకే దక్కుతుందన్నారు. రామోజీరావు తెలుగువారి కీర్తిని దేశ స్థాయిలో చాటిన వ్యక్తిగా సీఎం కొనియాడారు. రంగం ఏదైనా విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేసిన వ్యక్తి రామోజీరావు అన్నారు. పత్రిక నిర్వహణ ఒక సవాల్ అనుకునే పరిస్థితుల్లో ఐదు దశాబ్దాల పాటు ఈనాడు పత్రికను నెంబర్ వన్ స్థానంలో నడపడం, ఈటీవీ స్థాపనతో టీవీ మీడియా రంగానికి దశాదిశా చూపిన దార్శనికుడు రామోజీరావు అని సీఎం అన్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో భేటీ అయిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. రామోజీరావు లేని లోటు తెలుగు మీడియా రంగానికి, వ్యాపార రంగానికి తీరని లోటు అని సీఎం అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Exit mobile version