CM Revanth Reddy | విధాత, హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి(Justice sudarshan Reddy) గెలిస్తే తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుందని.. తెలుగు వారంతా ఒక తాటిపైకి వచ్చి ఆయన గెలుపుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తాజ్ కృష్ణ హోటల్(Taj Krishna Hotel) నిర్వహించిన ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. నీలం సంజీవరెడ్డి , వీవిగిరి, పీవీ నరసింహరావు, జైపాల్ రెడ్డి ,వెంకయ్య నాయుడు, ఎన్టీ రామారావు వంటి తెలుగు నేతలు గతంలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలుగు నాయకులు జాతీయ రాజకీయాల్లో అంత కీలక హోదాల్లో లేని లోటు నెలకొందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల అధ్యక్షులు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ , చంద్రశేఖర్ రావు, ఓవైసీ తో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎంపీలు, 18 మంది రాజ్యసభ సభ్యులంతా ఆత్మ ప్రభోదానుసారం తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని వ్యక్తిగతంగా అభ్యర్థిస్తున్నానన్నారు. జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండో స్థానంలో ఉన్నప్పుడు తెలుగువారు కూడా ఆ స్థాయిలో ఉండాలన్నారు.
సుదర్శన్ రెడ్డి గెలుపుతో రాజ్యాంగానికి రక్షణ
ఇండియా కూటమి ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గౌరవించి ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగారని..దీంతో ఎన్డీఎ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని ఎన్డీఎ కూటమి.. రాజ్యాంగాన్ని కాపాడాలని, రిజర్వేషన్లను కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఇండియా కూటమి ఎన్నికల్లో పరస్పరం తలపడుతున్నాయని రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. 18 ఏళ్ల కు ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) ఆలోచన ఒక వైపు.. ఓట్ చోర్ ఆలోచనతో మరో పార్టీ ఇంకో వైపు దేశంలో ఉన్నాయన్నారు. పెద్దల సభ రాజ్యసభ చైర్మన్ సీటులో గౌరవమైన వ్యక్తులు,అంబేద్కర్ విధానాలపైన సంపూర్ణ విశ్వాసం ఉన్నవారు కూర్చుంటే పూర్తి న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సుదీర్ష అనుభవం ఉంది. ఆయన వివిధ హోదాల్లో రాజ్యంగ స్పూర్తితో పనిచేశారు.. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించే పార్టీలో ఆయన మొదటి సభ్యత్వం తీసుకున్నారు.. రాజ్యాంగాన్ని రక్షించడమే ఆయన పార్టీ.. అని పేర్కొన్నారు. ఎజెండా, జెండా లేకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంతా మద్దతు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగాన్ని రక్షిస్తే దేశాన్ని రక్షించినట్లే..లేకుంటే దేశానికి నష్టం జరుగుతుందన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఒక జాతీయ నాయకుడు నక్సలైట్ అని అంటున్నారు..నక్సలిజం ఒక విధానం మాత్రమేనన్నారు.
నక్సలిజం ఫిలాసఫీ నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు.. మనకు నచ్చని ఫిలాసఫీతో వాదించి గెలవాలి.. కాని అంతం చేస్తానంటే కుదరదని స్పష్టం చేశారు.