Site icon vidhaatha

సొంతింటి కల నెరవేర్చుతున్నాం: సీఎం రేవంత్

ఖమ్మం, సెప్టెంబర్ 3 (విధాత): హనుమాన్‌ గుడి లేని గూడెం, గ్రామం ఉందేమో కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు తెలంగాణలో లేవని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆనాడు పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఇందిరాగాంధీ రోటీ, కపడా, మఖాన్‌ అనే నినాదం తీసుకున్నారని చెప్పారు. వైఎస్ హయాంలో పేదోడి సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని గుర్తు చేశారు. పదేళ్లలో 25 లక్షల ఇండ్లు ఇచ్చిన ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. గత ఎన్నికల సమయంలో ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చామన్న రేవంత్‌రెడ్డి.. ఇందిరమ్మ రాజ్యంలో ఆ హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మాట్లాడుతూ.. పేదోడి సొంతింటి కల నెరవేర్చాలని గృహ నిర్మాణ శాఖ బాధ్యత పొంగులేటి శ్రీనన్నకు అప్పగించినట్టు చెప్పారు. తన అంచనా తప్పలేదని, ఆయనకు అప్పగించిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని శ్రీనివాస్ రెడ్డిని సీఎం ప్రశంసించారు. ధరణిని బొందపెట్టి భూభారతిని తెచ్చారని, పేదోడి సొంతింటి కలను నిజం చేశారని అన్నారు. పేదరికాన్ని పారదోలడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షమని అన్నారు. పేదోళ్ల గుండెల్లో ఇందిరమ్మ స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. రేషన్ కార్డులు ఇచ్చాం.. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.

తెగకపోతే మంత్రగాడి వద్దకు పోండి
‘మీ పంపకాల్లో పంచాయితీ వస్తే కుటుంబ పెద్ద దగ్గరకు వెళ్లండి. తెగకపోతే కులపెద్ద దగ్గరికి పోండి. అక్కడ కూడా తెగకపోతే మంత్రగాడి దగ్గరకు పోండి. అంతే తప్ప మీ కుటుంబ పంచాయితీలో మమ్మల్ని లాగకండి..’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనపై కవిత చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారని అన్నారు. బావ, బామ్మర్ధి, అన్న, చెల్లి, ఇలా ఇల్లు మొత్తం ఎవరికి వారు కత్తులు పట్టుకొని పొడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దోపిడీ సొమ్ము ఆ కుటుంబంలో చిచ్చు పెట్టిందని అన్నారు. వాళ్లు వాళ్లు కొట్టుకుని తన పేరు తీసుకు వస్తున్నారని ఆయన పరోక్షంగా కేసీఆర్ కుటుంబంపై సెటైర్లు వేశారు. 2023 ఎన్నికల్లోనే ఆ కాలనాగును కట్టెతో కొట్టి చంపేశానని… ఇప్పుడు చచ్చిన పామును చంపాల్సిన అవసరం తనకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు.

Exit mobile version