అటవీ సంపదను పెంపొందించాలి
పండ్ల మొక్కలకు ప్రాధాన్యతనివ్వాలి
కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
వనమహోత్సవంలో ఉపయోగర మొక్కలు నాటాలి
కెనాల్స్ , చెరువు గట్ల వెంట తాటి, ఈత మొక్కలు
వికారాబాద్‌లో ఏకో టూరిజం
విధాత, హైదరాబాద్ : అటవీ సంపద పెంచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అటవీ విస్తరణకు డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి ఓపెన్ ఏరియా అటవీ భూములను గుర్తించాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఆ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన చెట్టు పట్టా విధానాన్ని పరిశీలించాలని తెలిపారు. పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత గిరిజనులకు అప్పగించేలా చూడాలన్నారు. అది గిరిజనులకు ఆదాయ వనరుగా మారడంతో పాటు కోతుల బెడద తగ్గే అవకాశం ఉంటుందని, పూర్తి పర్యవేక్షణ బాధ్యత అటవీశాఖకు ఉండేలా చూడాలన్నారు. కెనాల్స్ వెంట , చెరువుగట్ల వెంట తాటి, ఈత మొక్కలు నాటేలా చూడాలని, వనమహోత్సవంలో ఉపయోగకరమైన మొక్కలు మాత్రమే నాటేలా చూడాలని పేర్కోన్నారు. వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని, ఇందుకు సంబంధించి పూర్తి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. పోడు భూముల్లో పండ్ల తోటలు పెంచుకునేందుకు ప్రోత్సాహం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.