- మండిపడిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
- డీ లిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆగ్రహం
హైదరాబాద్ (విధాత): డిలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర పన్నుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం టూరిజం ప్లాజాలో పార్లమెంటు నియోజక వర్గాల పునర్విభజన- దక్షిణ భారత్ భవిష్యత్ కార్యక్రమంపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి, అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. డీ లిమిటేషన్ పై చర్చించకుంటే కేంద్రలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదన్నారు. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం ఏర్పడిన పార్లమెంటరీ నియోజకవర్గాలను కేంద్రం ఇప్పటివరకు స్తంభింపచేసిందని.. దీనిని మరో 25 సంవత్సరాల పాటు పొడిగించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
డీ లిమిటేషన్‌పై పార్టీలకు అతీతంగా కొట్లాడుదామని మహేశ్ కుమార్ గౌడ్ దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఈ మేరకు అందరూ కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. బీజేపీ ఫాసిస్టు విధానాన్ని ఎండగడదామన్నారు. జనాభా ఆధారంగా సీట్లు పెంచడం సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. తెలంగాణలో మతం పేరుతో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణకు వచ్చిన నిధులు గుండు సున్నా అని వ్యాఖ్యానించారు.
డీ లిమిటేషన్ పేరుతో దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్పించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దేవుడికి, రాజకీయాలకు ముడిపెట్టే బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. దక్షిణాది రాష్ట్రాల తరపున ప్రజా స్వామ్య పద్ధతిలో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. డి లిమిటేషన్ పై అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నారు.
1952, 1971లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు కుటుంబ నియంత్రణను తు.చ. తప్పకుండా తప్పకుండా పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మహేశ్ గౌడ్ ఆరోపించారు. డీ లిమిటేషన్ విధానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. 11 సంవత్సరాలు పాలించిన మోదీ దేశానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. కుల మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. పదవి వ్యామోహం అనే పిశాచి ఆవహించిన ప్రధాని మోదీ.. రష్యా అధినేత పుతిన్ వలే నియంతలా దేశాన్ని పాలించాలని ప్రయత్నిస్తున్నాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.