Site icon vidhaatha

రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు కాంగ్రెస్ నేతలే కారణం … మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్‌ నేతల అరాచకం వల్లే రైతు ప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్‌ కుటుంబాన్ని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డిలు ఆదివారం పరామర్శించారు. అనంతరం నిరంజన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాకర్‌ పట్టా భూమిని అధికార పార్టీలోని నేతలే కబ్జా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతల దౌర్జన్యంతోనే ప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని నిరంజన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతు ప్రభాకర్ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని, రైతు పొలంలో అక్రమంగా చొరబడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రైతు కుటుంబానికి బీఆరెస్‌ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు ప్రభాకర్‌ ఆత్మహత్యపై ఖమ్మం జిల్లా సీపీకి బీఆరెస్‌ నేతలు నిరంజన్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఫిర్యాదు చేశారు. అధికారులు సహకరించకపోవడం వల్లే రైతు ప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

Exit mobile version