వెలిచాలకు సీపీఐ మద్దతు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సీపీఐ శ్రేణులు పనిచేస్తాయని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు

  • Publish Date - April 25, 2024 / 07:11 PM IST

*కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
కోసం పనిచేస్తాం

*సీపీఐ జాతీయ కార్యవర్గ
సభ్యుడు చాడ వెంకటరెడ్డి

విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సీపీఐ శ్రేణులు పనిచేస్తాయని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు గెలుపు కోసం సీపీఐ, కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గురువారం కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సిపిఐ కార్యాలయాన్ని సందర్శించి, ఆ పార్టీ నేతలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాన కొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో బిజెపిని ఓడించేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏకం కావడం శుభ పరిణామం అన్నారు. కులాలు, మతాల మధ్య వైశమ్యాలు సృష్టించి, ఓట్లు దండుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కరీంనగర్ లో ఐదు సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడుగా ఉన్న బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించి, గెలుపు కోసం పని చేస్తామని మాట ఇచ్చిన సీపీఐ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.పది సంవత్సరాలు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, ఆదాని లాంటి కొద్ది మందికి దోచిపెట్టిందని విమర్శించారు. స్విస్ బ్యాంకుల్లో దాగి ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి దేశంలోని ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షల వేస్తామని ఇచ్చిన మాట మరిచి పోయిందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన హామీ కార్యరూపం దాల్చలేదన్నారు. కేంద్రంలో మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికే పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని రాజేందర్ రావు కోరారు. ఈ సమావేశంలో సీపీఐ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, గుంటి వేణు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి,గడిపె మల్లేష్,ఆదరి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్,గూడెం లక్ష్మీ,కాంగ్రెస్ నాయకులు అంజనీ కుమార్,జక్కని ఉమాపతి,బత్తిని చంద్రయ్య,మల్లిఖార్జున శైలజ తదితరులు పాల్గొన్నారు.

Latest News