సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ లింక్ కెనాల పనుల పరిశీలన
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుతో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సీతారామ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టు సంబంధించి లింక్ కెనాల్ నిర్మాణ పనులను ఏన్కూరు వద్ద ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబుతో కలిసి పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశాం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రీ డిజైన్ పేరుతో సీతారామ ప్రాజెక్టుకు రూ. 18వేల కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం పనులు చేపట్టి రూ.8 వేల కోట్ల ప్రజల సొమ్మును కాజేసిందని విమర్శించారు. కాళేశ్వరం, ఇరిగేషన్‌లో ప్రజల సొమ్ము లూటీ చేశారని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రాజెక్టులు అన్ని సాగులోకి తెచ్చి రైతులకు ఉపయోగపడాలని శరవేగంగా పనులు చేస్తున్నామని తెలిపారు.సీతారామతో లక్షా 35 వేల ఎకరాలు వైరా, లంకా సాగర్ ప్రాజెక్ట్‌ల మైనర్ ఇరిగేషన్‌లో అనుసంధానం చేస్తున్నామని అన్నారు. ఈ నెల 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. రాబోయే కొద్ది రోజుల్లో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు ఉన్నా అధిగమిస్తామని అన్నారు. లక్షా 75 వేల ఎకరాలు సాగులోకి మొదటి విడతలో తీసుకురాబోతున్నామని చెప్పారు. రూ.లక్షా నుంచి లక్షన్నర వరకు రైతు రుణమాఫీ జరిగిందని, 2లక్షల వరకు బ్యాంకులో రుణం ఉన్న అన్నదాతలకు మాఫీ చేస్తామని, ఆగస్టు 15న వైరా సభలో సీఎం రేవంత్‌రెడ్డి మూడో దశ రుణమాఫీ ప్రకటిస్తారన్నారు. రూ.31వేల కోట్లు రైతులకు ఇచ్చే పరిస్థితి లేకున్నా రైతులకిచ్చిన మాట మేరకు రుణమాఫీ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇస్తామన్నారు. మొదటి విడతగా 4లక్షల ఇళ్లు అందజేస్తామని ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు. నిరుపయోగంగా ఉన్న ఇళ్లను పూర్తి చేస్తామని అన్నారు. తెల్ల రేషన్ కార్డుల కోసం పేదలు ఎదురు చూస్తున్నారన్నారని, హెల్త్ కార్డు… తెల్లరేషన్ కార్డులు త్వరలోనే ఇస్తామని ప్రకటించారు.
ధరణీ అనే భూతంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని దానికి మోక్షం కల్పిస్తామని తెలిపారు. అద్భుతమైన రెవెన్యూ చట్టం తీసుకుని రాబోతున్నామని స్పష్టం చేశారు. 80 వేలు పుస్తకాలు చదివిన దొరవారు కేసీఆర్ సూచనలు చేస్తే పరిశీలించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం ప్రతి ఒక్కరి కలను నెరవేరుస్తుందని ఉద్ఘాటించారు. ప్రభుత్వ భూమి, నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.