విద్యుత్తు కమిషన్ రద్ధు చేయాలన్న పిటిషన్ కొట్టివేత … మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు

బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. చత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది

  • Publish Date - July 1, 2024 / 04:54 PM IST

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. చత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్తు కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, విచారణ పూర్తి చేయకుండానే మీడియా సమావేశంలో తప్పు చేసినట్లుగా తమపై నిందారోపణలు చేశారని కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసీఆర్ పిటిషన్‌లో పేర్కోన్న అంశాల మేరకు ఆయన తరపు న్యాయవాదుల హైకోర్టులు తమ వాదనలు వినిపించారు. మరోవైపు నిబంధనల మేరకే విద్యుత్తు కమిషన్ వ్యవహరిస్తోందని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తెలిపారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కు విచారణార్హత లేదని చెప్పారు. కేసీఆర్ తరపు న్యాయవాదుల వాదనను తోసిపుచ్చిన హైకోర్టు ఏజీ వాదనలను సమర్థించింది. విద్యుత్తు కమిషన్ విచారణను కొనసాగించవచ్చంటూ స్పష్టం చేసింది.
జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. విద్యుత్తు కమిషన్ చైర్మన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆధారాలు లేవని చెప్పింది. కేవలం మీడియా సమావేశం నిర్వహించారనే కారణంతో జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించారని అంటున్నారన్నారని, అలా అనుమానించడం కాదని, దానికి తగిన ఆధారాలు చూపించాలని హైకోర్టు కోరింది. జస్టిస్ ఎల్. నరసింహారెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో పిటిషనర్ కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొంది. కేసీఆర్‌కు జారీ చేసిన నోటీసుల్లో కమిషన్ చైర్మన్ ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని కోర్టు తెలిపింది. విద్యుత్తు కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం గురించి తెలుసుకోవడానికే ఆయనకు నోటీసులు జారీ చేశారని స్పష్టం చేసింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత కేసీఆర్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చినట్లు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాథే, జస్టిస్ జూలకంటి అనిల్ ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది.

కమిషన్ గడువు పెంపుపై సందిగ్ధత

జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్తు కమిషన్ నియామక గడువు జూన్ 30వ తేదీతో పూర్తవ్వగా, కమిషన్ విచారణ గడువు పొడగింపుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కమిషన్ మనుగడపై సందిగ్ధత నెలకొంది. కమిషన్ విచారణ పూర్తి కాకపోవడం, మరింత మందిని విచారించాల్సివుండటంతో కమిషన్ పొడిగింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. హైకోర్టులో కేసీఆర్ విద్యుత్తు కమిషన్‌కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ కొట్టివేయడం, విచారణ కొనసాగించవచ్చని వ్యాఖ్యానించడంతో ప్రభుత్వం పవర్ కమిషన్ గడువు పొడిగించడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకతలపై నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ జ్యూడీషియల్ కమిషన్ గడువు సైతం జూన్ 30వ తేదీతో ముగిసిపోగా, ఆగస్టు 31వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం ఈ సందర్భంగా గమనార్హం.

Latest News