Zareena Khan | యాక్టింగ్ రాక‌నే బోల్డ్ సీన్స్ చేస్తుంద‌ని అన్నారు.. బాలీవుడ్ నటి జరీనా ఖాన్ ఆవేదన

Zareena Khan | బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలనే ఆశతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే వారు చాలా మంది ఉంటారు. కొందరు మాత్రం కొన్ని సినిమాల తర్వాతే అవకాశాలు తగ్గిపోవడంతో పరిశ్రమకు దూరమవుతుంటారు.

Zareena Khan | బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలనే ఆశతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే వారు చాలా మంది ఉంటారు. కొందరు మాత్రం కొన్ని సినిమాల తర్వాతే అవకాశాలు తగ్గిపోవడంతో పరిశ్రమకు దూరమవుతుంటారు. అలాంటి నటీమణుల్లో బాలీవుడ్ నటి జరీనా ఖాన్ కూడా ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

జరీనా ఖాన్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన వీర్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా, తన అందం మరియు అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ తర్వాత కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

త‌ప్పుడు అభిప్రాయం..

వీర్ తర్వాత జరీనా హౌస్‌ఫుల్ 2, హేట్ స్టోరీ 3 వంటి సినిమాల్లో నటించింది. ముఖ్యంగా హేట్ స్టోరీ 3 సినిమాలో ఆమె చేసిన బోల్డ్ సన్నివేశాలు పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ సినిమా తర్వాత తనపై ఇండస్ట్రీలో ఒక తప్పు అభిప్రాయం ఏర్పడిందని జరీనా ఖాన్ తెలిపింది. “నాకు నటించడం రాదు కాబట్టే ఇలాంటి బోల్డ్ సీన్స్ చేస్తుంది” అనే కామెంట్లు వినిపించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జరీనా మాట్లాడుతూ… ఒక సినిమా కారణంగా తనపై తప్పుగా ముద్ర పడిందని తెలిపింది. ముఖ్యంగా అక్సర్ 2 సినిమా అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

అనుకోకుండా జోడించేవారు..

తనకు కథ చెప్పినప్పుడు ఆ సినిమా నోయర్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుందని చెప్పారు. కానీ షూటింగ్ ప్రారంభమైన తర్వాత కథ పూర్తిగా మారిపోయిందని ఆమె పేర్కొంది. సెట్స్‌కు వెళ్లిన ప్రతీసారి అనుకోకుండా బోల్డ్ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలు జోడించేవారని తెలిపింది.

“ముందుగా చెప్పిన కథకు పూర్తిగా భిన్నంగా సినిమా తీశారు. ఒక్కసారిగా చిన్న దుస్తులు ధరించమని, బోల్డ్ సీన్స్ చేయమని అడిగేవారు. నా బాధ ఎవరూ అర్థం చేసుకోలేదు. కథ చెప్పినప్పుడు ఒకరకంగా ఉండి, షూటింగ్ సమయంలో మరోరకంగా మార్చేశారు” అని జరీనా చెప్పింది. ఈ విషయంపై తాను దర్శక నిర్మాతలను ప్రశ్నించినట్లు ఆమె తెలిపింది. “ఇలాంటి సన్నివేశాలు చేయడం నాకు సమస్య కాదు. కానీ ముందుగా చెప్పకుండా ఎందుకు ఇలాంటి మార్పులు చేస్తున్నారు అని అడిగాను. నా గత సినిమా చూసి కావాలనే ఇలాంటి సన్నివేశాల్లో నన్ను ఇరికిస్తున్నారని అనిపించింది” అని ఆమె చెప్పింది.

న‌న్ను ఏ మాత్రం గౌర‌వించ‌లేదు..

దీంతో చిత్రబృందం అంతా తనకు వ్యతిరేకంగా మారిపోయిందని జరీనా ఖాన్ పేర్కొంది. నిర్మాతలు కూడా అలాంటి సన్నివేశాలు చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపింది. పెట్టుబడి నష్టపోతుందని భావించి చివరకు సినిమా పూర్తి చేశానని, కానీ ఆ తర్వాత కూడా తనను గౌరవించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా పూర్తయిన తర్వాత జరిగిన స్క్రీనింగ్‌కు కూడా నన్ను పిలవలేదు. నేను సరిగ్గా నటించలేదని ప్రచారం చేసి నా పేరు చెడగొట్టారు అంటూ జరీనా ఖాన్ బాధ వ్యక్తం చేసింది. మొత్తానికి తన కెరీర్‌లో ఎదురైన ఈ అనుభవాల గురించి ఆమె చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest News