Virosh | టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ కపుల్‌గా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఈ విరోష్ జంట అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి అనంతరం ఈ జంట తమ వెడ్డింగ్ జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.
తాజాగా రష్మిక మందన్న తమ హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. సాధారణంగా హల్దీ కార్యక్రమం అంటే పసుపు పూసుకుని మంగళ స్నానాలు చేసే సంప్రదాయ వేడుకగా ఉంటుంది. కానీ విజయ్–రష్మిక హల్దీ మాత్రం కాస్త భిన్నంగా, సరదాగా జరిగింది.
హల్దీ వేడుకలో హోలీ సందడి
ఈ హల్దీ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి రంగులు, నీళ్లతో సరదాగా ఆడుకున్నారు. అందుకే ఈ వేడుక హల్దీలా కాకుండా హోలీలా మారిపోయిందని రష్మిక తన పోస్టులో పేర్కొంది. “అది కేవలం హల్దీ వేడుక కాదు… హల్దీతో పాటు హోలీ కూడా జరిగినట్లు అనిపించింది. రంగులు, నీళ్లతో ఎంతగా తడిసిపోయామంటే ఇప్పటికీ నా జుట్టులో ఎరుపు రంగు పూర్తిగా పోలేదు” అంటూ ఆమె సరదాగా రాసుకొచ్చింది.
టీమ్ బ్రైడ్‌కు విజయ్ సపోర్ట్
హల్దీ రోజున జరిగిన ఆటల గురించి కూడా రష్మిక ఒక క్యూట్ సీక్రెట్ బయటపెట్టింది. పెళ్లి వేడుకల్లో సాధారణంగా వరుడు, వధువు తరఫు వారు విడిపోయి పోటీ పడుతుంటారు. కానీ ఈసారి మాత్రం చిన్న ట్విస్ట్ జరిగింది. వరుడు విజయ్ దేవరకొండ స్వయంగా రష్మిక టీమ్‌లో చేరిపోయి ఆమె గెలవడానికి సహాయం చేశాడట. “ఆ రోజు జరిగిన అన్ని ఆటల్లో టీమ్ బ్రైడ్ గెలిచింది. ఎందుకంటే విజ్జూ మా టీమ్‌లోనే ఉన్నాడు” అంటూ రష్మిక చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
రంగుల నీళ్లలో మునిగిపోయిన కుర్తా
విజయ్ దేవరకొండ కూడా ఆ రోజు జరిగిన సరదా సంఘటనలను గుర్తు చేసుకుంటూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ముందురోజు జరిగిన సంగీత్ వేడుకలో రాత్రంతా సందడి చేసినప్పటికీ, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మరింత ఆనందంగా గడపాలని భావించి హల్దీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపాడు. ఆ అల్లరిలో తాను ఎంతో ఇష్టపడి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కుర్తా కూడా రంగుల నీళ్లతో పూర్తిగా పాడైపోయిందని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
ఇప్పటి ట్రెండ్ ప్రకారం చాలా మంది సెలబ్రిటీలు విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. అయితే తన పెళ్లి మాత్రం భారత్‌లోనే జరగాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు విజయ్ వెల్లడించాడు. ప్రకృతి మధ్యలో ప్రశాంత వాతావరణంలో పెళ్లి జరగాలనే ఉద్దేశంతో ఉదయపూర్‌లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌ను ఎంచుకున్నట్లు తెలిపాడు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో కొండలు, పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ఆ ప్రదేశం తమ పెళ్లికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చిందని ఈ జంట పేర్కొంది.
సోషల్ మీడియాలో రికార్డులు
ఇప్పటికే విరోష్ జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల వీరి మ్యారేజ్‌కు సంబంధించిన ఒక పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 27 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి రికార్డు సృష్టించింది. తాజాగా షేర్ చేసిన హల్దీ వేడుక ఫోటోలు కూడా అదే స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ “క్యూట్ కపుల్”, “పర్‌ఫెక్ట్ జంట” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ జంట పంచుకుంటున్న ప్రతి వెడ్డింగ్ మెమరీ సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది.
