Site icon vidhaatha

E Car racing । కేటీఆర్‌పై ఈడీ ఫోకస్‌? ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ కేసులో ఏసీబీని వివరాలు కోరిన ఈడీ

E Car racing ।  ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సైతం రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేసింగ్‌కు ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.55 కోట్ల నిధులు బదలాయించారన్న ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. కేసీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు ఏసీబీకి లేఖ రాసినట్టు తెలుస్తున్నది.

వాటితోపాటు ఎఫ్‌ఐఆర్‌ కాపీ, హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారు? అనే వివరాలను సైతం కోరినట్టు సమాచారం. దాన కిశోర్‌ ఫిర్యాదు కాపీని కూడా పంపాలని ఈడీ కోరినట్టు తెలుస్తున్నది. బ్రిటన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఈవో)కు నిధులు పంపడానికి ఉద్దేశించిన లావాదేవీలు చోటు చేసుకున్న తేదీల వివరాలను సైతం ఈడీ అధికారులు కోరినట్టు తెలుస్తున్నది.

ఈడీ సైతం దర్యాప్తు చేపడితే కేటీఆర్‌కు రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని, ఆయన అరెస్టు జరిగిన పక్షంలో బీఆరెస్‌లో సైతం సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నయన్న చర్చలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకే కాదు.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అసెంబ్లీలో, బయట కేటీఆర్‌, హరీశ్‌ మాత్రమే పార్టీని మోస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ అరెస్టు అయితే.. ఇక హరీశ్‌ చుట్టూనే బీఆరెస్‌ నడుస్తుందనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఇది రాబోయే రోజుల్లో ఎటువైపు దారి తీస్తుందనే విషయంలో అనేక చర్చలు నడుస్తున్నాయి.

Exit mobile version