ట్యాపింగ్‌ తొలి బాధితుడిని నేనే

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడిని తానేనని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు

  • Publish Date - April 7, 2024 / 07:59 AM IST

 

నా వంట మనుషుల ఫోన్‌లూ ట్యాప్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ వల్లే ఈ పరిస్థితిలో ఉన్నా

క్యాబినెట్‌ మంత్రులనూ నమ్మని కేసీఆర్‌

వారితోపాటు ఎమ్మెల్యేల ఫోన్లపై నిఘా

ఆఖరుకు భార్యాభర్తల మాటలూ విన్నారు

కొన్ని కుటుంబాలు కూలిపోయాయి

బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌

మల్కాజిగిరి: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడిని తానేనని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. తన ఫోన్‌తోపాటు.. తన కుటుంబసభ్యులు, డ్రైవర్‌, ఆఖరుకు వంట మనుషుల ఫోన్‌లను కూడా ట్యాప్‌ చేశారని ఆరోపించారు. ఆదివారం మల్కాజిగిరిలో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆనాడు బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వల్లే తాను ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నానని వాపోయారు. కేసీఆర్ ఆయన కేబినెట్‌లోని 17 మంది మంత్రులను కూడా నమ్మలేదని చెప్పారు. వాళ్ళ ఫోన్లతో పాటు ఎమ్మెల్యేల ఫోన్లను, చివరకు వివిధ రంగాల ప్రముఖుల, భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారని ఆరోపించారు. ట్యాపింగ్‌ ఫలితంగా కొందరి కాపురాలు కూలిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా బాధాకరమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఈటల డిమాండ్ చేశారు. బీఆరెస్‌ హయాంలో గెలిచిన ఎమ్మెల్యేలను కాదని.. ఓడిన ఎమ్మెల్యేలతో ప్రారంభోత్సవాలు జరిపించారని, తాను ఎమ్మెల్యేగా ఉన్నా కనీసం ప్రోటోకాల్ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే చేస్తోందన్నారు. మల్కాజిగిరిలో తనను గెలవనీయకుండా చేయాలని రేవంత్‌రడ్డి చూస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ గతంలో తనను అన్యాయంగా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, బీఆరెస్ నుంచి మెడలు పట్టి బయటకు పంపాక తనను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అని, తాను ఆ పార్టీకి కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు.

జాతీయ హామీలతో వంచిస్తున్న కాంగ్రెస్‌

అధికారంలోకి రాలేని కాంగ్రెస్‌ పార్టీ హామీలు ఎలా అమలు చేస్తుందని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. జాతీయ హామీలతో తెలంగాణ ప్రజలను వంచించడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో మల్కాజిగిరి సహా 12 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలవబోతున్నదని ఈటల జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లు గెలిచినా కాంగ్రెస్ బలం దేశవ్యాప్తంగా 60 స్థానాలకు మించదన్నారు. ఇక్కడ 17 స్థానాల్లో గెలిచినంత మాత్రాన రాహుల్ ప్రధాని ఎలా అవుతారు? ఆ పార్టీ ఇచ్చే హామీలు ఎలా అమలవుతాయి? అని ఈటల ప్రశ్నించారు. నిధుల విషయంలో కేంద్రాన్ని నిందించలేరని, ఆర్థిక సంఘం కేటాయింపుల ప్రకారమే రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తోందని ఈటల తెలిపారు.

Latest News