ఈ ఫార్ములా కాదు.. యూరియా ఫార్ములా ఏందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హై కోర్టు ఆర్డర్ తో గ్రూప్-1 ఫార్ములా తేలిపోయిందని వెల్లడించారు. కాంగ్రెస్ డైవర్సన్ పాలిటిక్స్ తో ప్రజలను ఇబ్బంది పెడుతున్నరని మండిపడ్డారు. రెండేళ్లుగా ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కరెంట్, కాళేశ్వరం మీద కమిషన్ లు, ఫోన్ టాపింగ్ కేసు ప్రతిదీ అబద్ధం అని తేలిపోయిందని, ఆ ఫార్ములా.. ఈ ఫార్ములా అని మళ్లీ కాలయాపన మొదలు పెట్టిండ్రని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఏ ప్రభుత్వమైనా బాద్యతతో కొనసాగించాలని, ప్రభుత్వ ఆదాయ వ్యయాల బాధ్యత నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. ఈ ఫార్ములా విషయంలో మీ జ్ఞానం ఏమిటో ప్రజలకు అర్థమైందన్నారు. ఈ కేసులో వాళ్ళతో మిలాకత్ అయి డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది లొట్టపీసుల కేసు అని కేటీఆర్ ఆనాడే చెప్పిండని తెలిపారు. అసలు కేసులు పెట్టాల్సి వస్తే ఈ రెండేళ్ల పాలనలో మిమ్మల్ని వంద సార్లు జైళ్ల పెట్టొచ్చని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బెదిరించి మీడియాలో స్పేస్ ఆక్యూపై చేస్తాడేమో కారీ ప్రజల మనసులో మాత్రం స్పేస్ ఆక్యూపై చేయలేడని ఘాటుగా విమర్శించారు.
రైతులు, మహిళలు పెట్టే శాపనార్థాల నుంచి, రేవంత్ సర్కార్ పెట్టిన విష ఆహారం తిని మరణించిన వంద మంది విద్యార్థుల ఆత్మలు నీ చుట్టే తిరుగుతున్నాయని వారి నుంచి రేవంత్ రెడ్డి తప్పించుకోలేడని విమర్శలు చేశారు. కేసును సీబీఐకి అప్పగించడంతోనే మోడీతో నీ బంధం బహిరంగమైందని, మోడీతో నీ చోటబాయ్ బడే బాయ్ బంధం బయటపడిందని ఆరోపించారు. ప్రజల దృష్టిలోనే కాదు మీ అధిష్టానం దృష్టిలో కూడా కంటు అవుతున్నావని అన్నారు. ఈ డ్రామాలు, డైవర్సన్ పాలిటిక్స్ తో బీఆర్ఎస్‌ను ఏమిచేయలేవు, తెలంగాణ ప్రజలను ఏమార్చడం ఎవరికీ సాధ్యం కాదని జగదీష్ రెడ్డి తెలిపారు.