Padi Kaushik Reddy : తొలి రోజునే రభస..ముందంతా రచ్చరచ్చనే!

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రసాభాసగా ప్రారంభమయ్యాయి. చెక్ డ్యామ్‌లను బాంబులతో పేల్చుతున్నారన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.

Padi Kaushik Reddy

విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తొలి రోజునే రభసతో సాగాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్రంలో చెక్ డ్యామ్ లను బాంబులు పెట్టి పేల్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఎన్నికల లబ్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీని పేల్చినట్లే.. తన హుజురాబాద్ నియోజకవర్గంలోని తనుగుల చెక్ డ్యామ్‌ను పేల్చేశారని, ఇప్పుడు అదే తరహాలో చెక్ డ్యామ్ పేల్చేశారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అవకాశం కల్పించడంతో ఆ వివాదానికి బ్రేక్ పడింది.

యూరియా యాప్‌తో రైతులు ఆగమాగం అవుతున్నారని. యాప్ లేకుండా యూరియా పంపిణీ చేయాలని ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు కేవలం 9 గంటలే ఇస్తోందని, ట్రాన్స్‌ఫార్మర్స్, పోల్స్, కరెంట్ వైర్లు కావాలని రైతులు అడిగితే.. బడ్జెట్ లేదని అధికారులు చెప్తున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రి టి.హరీష్ రావు మాట్లాడుతూ రెండేళ్లయినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తక్షణమే ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ భీంగల్ వంద పడకల ఆస్పత్రి పనులు దాదాపు 85 శాతం పనులు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు. రూ.5 కోట్లు విడుదల చేస్తే మిగిలిన పనులు పూర్తవుతాయని చెప్పారు. నిధులు విడుదల చేసి పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

భాష హుందాగా ఉండాలి : బీజేపీ ఎమ్మెల్యే కాటెపల్లి

శాసనసభ లోపల, బయట మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి సహా రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరకర భాషను వినియోగిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. మన రాజకీయ నాయకుల వల్లే బయట కొందరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు గౌరవ మర్యాదలతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్యూచర్ లో సభకు వచ్చే సభ్యులకు మనం ఆదర్శంగా ఉండేలా ప్రస్తుత నాయకుల భాష ఉండాలని ఆకాంక్షించారు. చాలా మంది సీఎం, మాజీ సీఎం, ప్రధాని పట్ల అగౌరవంగా మాట్లాడుతున్నారన్నారు. చిన్ననాటి మిత్రులు, క్లాస్‌మేట్స్‌తో మాట్లాడినట్టు సంబోధిస్తున్నారని తెలిపారు. సభలో అర్థమవంతమైన విమర్శలు, ప్రతివిమర్శలతో చర్చలు కొననసాగించాలని కోరారు.

స్పందించిన శాసన సభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్ బాబు రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు హుందాకరమైన భాషతో మాట్లాడటం ద్వారా ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సభలో చర్చల సందర్భంగా సభ్యులు అంతా గౌరవప్రదమైన భాషను వినియోగించాలని కోరుతున్నామన్నారు.

ఇవి కూడా చదవండి :

California Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతులు మృతి
Allu Sirish | అల్లు శిరీష్ పెళ్లి తేది ఫిక్స్‌.. అల్లు ఫ్యామిలీలో మళ్లీ మార్చి 6 మ్యాజిక్!

Latest News