వరంగల్ జిల్లాలో బిజెపికి షాక్.. కాంగ్రెస్ గూటికి రేవూరి ప్రకాష్ రెడ్డి?

  • Publish Date - October 16, 2023 / 05:50 AM IST

  • పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో మంతనాలు
  • పరకాల టికెట్ ఆశిస్తున్న రేవూరి


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిజెపికి గట్టి షాక్ తగలనుంది. నర్సంపేట అభ్యర్థిగా నేడో రేపో ప్రకటన వెలువడే సమయంలో ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధమవుతున్నారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ వైస్ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను ప్రకాష్ రెడ్డి కలిశారు. ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సమ్మతించినట్లు చెబుతున్నారు. ఈనెల 18వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.


ప్రకాష్ రెడ్డి పరకాల సీటు ఆశిస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇనుగాల వెంకటరామిరెడ్డి, కొండా మురళి, మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ టికెట్ ఆశిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రేవూరికి కాంగ్రెస్ పార్టీ పరకాల సీటు ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రకాష్ రెడ్డికి పరకాల నియోజకవర్గం లోని పలు ప్రాంతాలతో సంబంధాలు ఉన్నాయి. తన స్వగ్రామం కేశవాపురం పరకాల నియోజకవర్గాన్ని ఆనుకొని ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నేతగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన సుపరిచితం.


 

బిజెపిలో నిరాశాజనకం


నర్సంపేటలో బిజెపి బలపడేందుకు రేవూరి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఫలితాలు లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో రేవూరి కాంగ్రెస్, టిడిపి ఆలయన్స్ లో భాగంగా వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ దఫా పరకాల మంచి పోటీకి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వనుండడంతో అటువైపు మొగ్గుచూపునట్లు చెబుతున్నారు.


నర్సంపేట బిజెపి ఖాళీ


నర్సంపేట బిజెపి స్థానం ఖాళీ కానున్నందున ఆ పార్టీలో ఉన్న రాణి రుద్రమను లేదా స్థానిక కాంట్రాక్టర్ ను బిజెపిలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రేవూరి కాంగ్రెసులో చేరితే నర్సంపేటలోని ఆయన అనుచర వర్గం కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక విధంగా కాంగ్రెస్కు లాభిస్తుండగా, బీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం నియోజవర్గ ఫలితాలపై ఉంటుంది.

Latest News