విధాత, హైదరాబాద్ : ఫార్ములా ఈ కారు రేస్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై విజిలెన్స్ కమిషన్ చర్యలకు సిఫార్సు చేసింది. ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ కమిషన్ ఏసీబీ నివేదికను విచారణ జరిపి ఇద్దరు అధికారుల ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చింది. ఫార్ములా ఈ-రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు ఏ4, ఏ5 రేసు సంస్థ ప్రతినిధులు ఉన్న విషయం తెలిసిందే. ఫార్ములా ఈ-కారు రేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండు సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్‌ను మూడు సార్లు ఏసీబీ ప్రశ్నించింది.
మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ కోసం ఏసీబీ నివేదిక గవర్నర్ వద్దకు వెళ్లింది. దీనిపై ఇప్పటివరకు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ వ్యవహారం రూ.54.88 కోట్లకే ఆగిపోయిందని, లేదంటే రూ.600 కోట్ల స్కామ్జరిగి ఉండేదని ఏసీబీ తన నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం.