MLA Raja Singh | హిందూ దేవుళ్ల బొమ్మలున్న బాణాసంచాను కాల్చొద్దని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేవతల బొమ్మలు ఉన్న పటాకులను హిందువులతోనే కాల్చేలా కుట్ర జరుగుతుందని.. దాన్ని అడ్డుకోవాలన్నారు. గురు, శుక్రవారాల్లో దీపావళి పండుగ సందర్భంగా భారీగా టపాసులు కాల్చనున్నట్లు పేర్కొన్నారు. అయితే, పిల్లలతో జాగ్రత్తగా పటాకులు కాల్చేలా చూడాలన్నారు. పండుగ రోజున లక్ష్మీదేవిని పూజిస్తామని తెలిపారు. అయితే, పటాకులపై లక్ష్మీదేవి చిత్రాలను పెట్టి అమ్ముతున్నారని.. ఈ కుట్ర ఎన్నో ఏళ్లుగా సాగుతుందన్నారు. అలాంటి పటాకులను కాల్చకుండా ఓ సంకల్పంలా తీసుకోవాలన్నారు. హిందువులంతా హిందుదేవతల బొమ్మలు ఉండే బాణాసంచాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు రాజాసింగ్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
MLA Raja Singh | హిందూదేవుళ్ల బొమ్మలున్న పటాకులను కాల్చొద్దు.. ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపు
