ఫార్మాసిటీకి నేను 17 ఎకరాలు ఇచ్చాను..రద్దు ఖాయం: హరీశ్‌రావు

ఫార్మాసిటీ కోసం తాను 17 ఎకరాలు ఇచ్చానని హరీశ్‌రావు వెల్లడించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్‌ సిటీని వందకు వంద శాతం రద్దు చేస్తుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు మరోసారి పునరుద్ఘాటించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్ లో మాట్లాడారు. ఫార్మా సిటీ రద్దు చేసి భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, అలాగే భూములు ఫార్మాకు కాకుండా మార్పులు చేస్తే చట్టం అంగీకరించబోదని హరీశ్ రావు గుర్తు చేశారు. పార్మాసిటీ కోసం నేను కూడా 17 ఎకరాల భూమి ఇచ్చానని వెల్లడించారు. ఫార్మా భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం వాడితే ఊరుకుంటామా? అని హరీశ్‌రావు అన్నారు. ఫార్మాసిటీ నిర్మించకుండా, భూములు వెనక్కి ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఫ్యూచర్ సిటీని తెరపైకి తెచ్చారని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల రూ.70వేల కోట్ల ఫార్మా పెట్టుబడులు పోయాయని విమర్శించారు.

విద్యార్థుల యూనిఫామ్ లు ఎక్కడా.?

ఏటా జూన్ 12న తెరుచుకోవాల్సిన స్కూళ్లను 15వ తేదీకి ఎందుకు వాయిదా వేశారు. దీని వెనుక ఏకంగా రూ. 2 వేల కోట్ల భారీ కుంభకోణం దాగి ఉందని, కమీషన్ల కోసం కాంట్రాక్టులు సెట్ కాకపోవడం వల్లే బడుల ప్రారంభాన్ని వాయిదా వేశారని, విద్యాశాఖలో గుజరాత్ కాంట్రాక్టర్ల పేరుతో ఈ కుంభకోణం జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలు, ప్రభుత్వ బడుల్లో యూనిఫామ్స్ కుట్టే బాధ్యత చేనేత కార్మికులకు.. షూ, బెల్టుల తయారీ దళిత కుటుంబాలు బతకాలని లిడ్ క్యాప్ కు ఇచ్చాం అని, రేవంత్ రెడ్డి వాటిని సెంట్రలైజ్ చేసి,మన వాళ్ల పొట్టగొట్టి గుజరాత్ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాడని హరీశ్ రావు ఆరోపించారు. ఆ గుజరాత్ కాంట్రాక్టర్ నుంచి ఇంతవరకు బట్టలు రాలేదు. 7 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఇవ్వాల్సిన బ్యాగులు, డ్రెస్సులు, బెల్టులు, నోట్‌బుక్స్ ఏవీ ఇంకా అందలేదన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు స్కూల్ తెరిచిన మొదటి రోజే అన్నీ ఇచ్చేవాళ్లం. అన్యాయం జరిగిందని చేనేత సంస్థలు కోర్టుకు కూడా వెళ్లాయి అని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం వల్లే విద్యావ్యవస్థ ఇంత అస్తవ్యస్తంగా మారిందని, సీఎం కనుసన్నల్లో గత టెండర్ల కంటే ఇప్పుడు రేట్లు డబుల్ చేసి మరీ టెండర్లు ఫైనల్ చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చివరకు విద్యార్థులు తినే కోడిగుడ్డులో కూడా అవినీతి చేయడం దారుణం. పేద పిల్లలు చదివే గురుకులాల్లో ఇలా కమీషన్లు కొడితే దేవుడు కూడా క్షమించడన్నారు.

ప్రభుత్వ బడులకు పెండింగ్ బకాయిలు

ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య దారుణంగా తగ్గిపోయిందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే రిపోర్ట్ ఇస్తే.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి యూకేజీఅని రకరకాల కట్టుకథలు చెబుతున్నారని ఆరోపించారు. బడుల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అసలు అములే కావడం లేదు అని, అమ్మ ఒడి కమిటీల ద్వారా పనులు చేసిన మహిళా సంఘాలకు, పేదలకు ఒక్కో నియోజకవర్గానికి రూ. 4 కోట్ల చొప్పున బిల్లులు పెండింగ్ పెట్టారని గుర్తు చేశారు. బడుల్లో పనిచేసే స్కావెంజర్లకు సైతం నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదన్నారు.

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడి వెన్నుపోటు కుట్ర ఉందని హరీశ్ రావు ఆరోపించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశించిన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తే ఈ వెన్నుపోటుకు పాల్పడినట్లు మాకు పక్కా సమాచారం ఉందన్నారు. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన మధ్యప్రదేశ్ మంత్రి సైతం మీనాక్షి నటరాజన్‌పై ఉన్న కేసుల సమాచారం తెలంగాణ కాంగ్రెస్ నుంచే వచ్చిందని కుండబద్దలు కొట్టారుగతంలో ఆమెకు రాజ్యసభ సీటు రాకుండా అడ్డుకున్న వ్యక్తినే ఇప్పుడు ఇక్కడ ఉండి ఈ కుట్ర చేశాడన్నారు. సొంత పార్టీ ఇంఛార్జీకి వెన్నుపోటు పొడిచే నాయకులు, ఇక సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఈ నామినేషన్ తిరస్కరణ కుట్రపై రేవంత్ రెడ్డి సిట్ విచారణ వేస్తాడా.లేక ఇంకేదైనా విచారణ వేస్తాడా. ఏదో ఒకటి చేసి అసలు ఏం జరిగిందో నిగ్గు తేల్చాలన్నారు.

రైతులకు, జీతాలకు, విద్యార్థులకు లేని డబ్బులు సీఎం విలాసాలకు ఉన్నాయా?

కేసీఆర్ అత్యద్భుతమైన సెక్రటేరియట్ నిర్మిస్తే, అక్కడికి వెళ్లని రేవంత్ రెడ్డి.. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నాడని, ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో మరో క్యాంపు కార్యాలయం కట్టుకుంటున్నాడు. చదువు చారెడు.. బలపాలు దోసెడు అన్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి తీరు ఉందని హరీశ్ రావు సెటైర్లు వేశారు. జూబ్లీహిల్స్‌లో తన నివాసానికి కొద్ది దూరంలోనే ఏకంగా రూ. 100 కోట్లతో బోధి పెవిలియన్ పేరుతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నాడని, అర్ధరాత్రి పూట సతీసమేతంగా వెళ్లి అక్కడి పనులను, కుటుంబ సభ్యులతో సోఫాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నాడని, ఈ గెస్ట్ హౌస్ కోసం మొదట వీవీఐపీ గెస్ట్ హౌస్ పేరుతో కేవలం రూ. 7 కోట్లతో జీవో ఇచ్చి, ఇప్పుడు దాన్ని రూ. 100 కోట్లకు పెంచారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ రూ. 17 కోట్లతో ఇనుప కంచెలు, ఫుట్‌బాల్ ఆడుకోవడానికి రూ. 10 కోట్లతో స్టేడియం నిర్మిస్తూ ముఖ్యమంత్రి సోకులు పడుతున్నాడన్నారు. ముఖ్యమంత్రి విలాసాలకు క్యాంపు కార్యాలయాలు కడుతుంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో తన సొంతానికి మూడో క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నాడని హరీశ్ రావు ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి, రైతులకు సాయం చేయడానికి ఖజానాలో డబ్బులు లేవంటున్న ప్రభుత్వానికి.. వందల కోట్లతో గెస్ట్ హౌస్‌లు కట్టుకోవడానికి మాత్రం నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు.

రూ.5కోట్ల అద్దెతో కొత్త హెలికాప్టర్

రాష్ట్రంలో డబ్బులు లేవనడం పచ్చి అబద్ధం. ముఖ్యమంత్రి సోకులకు, విలాసాలకు మాత్రం ప్రజాధనానికి కొదవే లేదు అన్నారు. మెస్సీతో ఫుట్‌బాల్ ఆడటానికి వంద కోట్లు, అందాల పోటీల కోసం మరో వంద కోట్లు దర్జాగా ఖర్చు పెడుతున్నారన్నారు. కానీ జర్నలిస్టుల సంక్షేమ నిధికి, ఉద్యోగుల జీతాలకు, రైతులకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవంటున్నారని తప్పుబట్టారు. మొన్నటివరకు నెలకు రూ. 2 కోట్ల అద్దెతో తిరిగిన హెలికాప్టర్ స్థానంలో, ఇప్పుడు నెలకు ఏకంగా రూ. 5 కోట్లు వెచ్చించి మరీ కొత్త హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి షికార్లు చేస్తున్నాడని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేసింది. అయితే గతంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల కాంగ్రెస్ అనుయాయులు భారీగా భూములు కొనుక్కున్నారని, ఇప్పుడు వారికి మేలు చేసేందుకు ఆ ఔటర్ లోపల ఉన్న 111 జీవోను కూడా ఎత్తివేసేలా సెక్రటేరియట్‌లో పెద్ద ఎత్తున ఫైళ్లు నడుపుతున్నారని ఆరోపించారు.

రియల్ ఎస్టేట్ మరింత ఢమాల్

అడ్డగోలుగా పెంచిన భూముల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రభుత్వ విధానాలతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. ఇతర రాష్ట్రాల్లో కొన్ని SFTల వరకు తక్కువ ధరలు నిర్ణయిస్తే, ఇక్కడ మాత్రం ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పన్నుల మీద పన్నులు వేస్తూ పేదల నడ్డి విరుస్తోంది. ఆర్టీఏ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మద్యం ధరలు ఇప్పటికే పెంచారు, మళ్లీ ఇప్పుడు మందుల ధరలు కూడా పెంచబోతున్నారన్నారు. ఇది చాలవన్నట్లు మళ్లీ ఇప్పుడు భూమి శిస్తు కూడా తెస్తామని ముఖ్యమంత్రి అంటున్నాడని, హెచ్ఎండీఏ ద్వారా అప్పులు తేవడమే కాకుండా, రెగ్యులర్ ట్యాక్స్‌తో పాటు కొత్తగా టోల్ గేట్లు పెట్టి మరీ ‘అడిషనల్ ఇంపాక్ట్ ఫీజు పేరుతో’ ప్రజల జేబులు గుల్ల చేయబోతున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, FRBM పరిమితికి మించి వేల కోట్ల అప్పులు తేవడానికి ఈ ప్రభుత్వం ఏకంగా దళారులను పెట్టుకుందన్నారు. అప్పులు ఇప్పించినందుకు ఆ బ్రోకర్లకు వందల కోట్లు కమీషన్లుగా దోచిపెడుతున్నారని, మన రాష్ట్రం కమీషన్లు ముట్టజెప్పగానే.. ముంబైకి చెందిన ఆ బ్రోకర్ ఏకంగా ఓ విమానమే కొనుక్కున్నాడని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కమీషన్ల కోసం వందల కోట్ల అప్పులు తెస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు.

ఖమ్మం మైనర్ బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలి

ఖమ్మం మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బాలికకు జరగాల్సిన చేతుల సర్జరీలు వెంటనే పూర్తి చేసి, ఆమె పూర్తిగా కోలుకునే వరకు అయ్యే వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించాలన్నారు. నిందితులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. రోజుకు 5 నుంచి 6 పోక్సో కేసులు నమోదవుతున్నాయని, వికారాబాద్ జిల్లా యాలాల్, బొమరాజపేట, బషీరాబాద్, మోమిన్ పేట మరియు నిర్మల్ లో మైనర్ బాలికలపై జరిగిన వరుస అత్యాచారాలే దీనికి నిదర్శనం అన్నారు. NCRB డేటా ప్రకారమే తెలంగాణలో చిన్న పిల్లలపై దాడులు పెరుగుతున్నాయి. 2024లో 2200 మంది చిన్న పిల్లలపై పోక్సో కేసులు నమోదు కాగా, 2025లో ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ సంఖ్య ఏకంగా 2400 కు పెరిగిందని తెలిపారు.

కేసీఆర్ హయాంలో మహిళల రక్షణ కోసం ‘షీ టీమ్స్’, ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్‌లను పటిష్టంగా అమలు చేశాం. నేడు ఆ విభాగానికి అడిషనల్ డీజీగా ఉన్న అధికారికే అదనంగా సీఐడీ, ఏసీబీ బాధ్యతలు కూడా అప్పగించి మహిళా భద్రతను గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయిందన్నారు. కరీంనగర్ లో పట్టపగలు దొంగతనం, హైదరాబాద్ నడిబొడ్డున అడిషనల్ డీజీ భార్య హత్య కేసు, ఖమ్మంలో సెల్ ఫోన్ దుకాణంలో లూటీ వంటి ఘటనల్లో ఇప్పటివరకు రికవరీ లేదన్నారు. కొంతమంది పోలీసులు సోషల్ మీడియాలో పీఆర్ స్టంట్ల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. పౌరులను కాపాడాల్సిన సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎక్స్ అకౌంట్, వెబ్సైట్ హ్యాక్ అవ్వడమే ఈ ప్రభుత్వ చేతకానితనానికి అద్దం పడుతోందని హరీశ్ రావు విమర్శించారు.

19వేల పోలీసు ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి

రాష్ట్రంలో 19,000 పోలీసు ఖాళీలుంటే కేవలం 5వేలకే నోటిఫికేషన్ ఇస్తామనడం నిరుద్యోగులను మోసం చేయడమేనని, తక్షణమే ఖాళీగా ఉన్న మొత్తం 19 వేల పోలీసు ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావును కలిసి నోటిఫికేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై పలువురు నిరుద్యోగులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ..ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలన్న కాంగ్రెస్, రెండున్నరేళ్లలో 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. కుదించిన వయోపరిమితిని వెంటనే రద్దు చేసి, గతంలో ఉన్నట్లు కానిస్టేబుల్‌కు 36 ఏళ్లు, ఎస్సైకి 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ హయాంలో ఒకేసారి 16 వేలు, 17 వేల చొప్పున భారీగా నోటిఫికేషన్లు పోలీస్ శాఖలో ఇచ్చామని, కేవలం పోలీస్ శాఖ లోనే దాదాపు 48 వేల పోస్టులు భర్తీ చేసామని ఆయన గుర్తుచేశారు.రాష్ట్రంలో 19,000 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి, డీజీపీ చెబుతుంటే.. కేవలం 5 వేల ఉద్యోగాలతోనే నోటిఫికేషన్ ఇస్తామనడం నిరుద్యోగులను వంచించడమేనని హరీష్ రావు విమర్శించారు.

పోలీస్ ఈవెంట్స్‌లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడం పట్ల హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు ఈవెంట్లలో మూడింటికి అర్హత సాధిస్తే సరిపోయేదని, కానీ ఇప్పుడు లాంగ్ జంప్, షాట్ పుట్‌లలో దూరం పెంచి మూడింటికి మూడు క్వాలిఫై కావాలనడం అన్యాయమన్నారు. వెంటనే పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో జాబ్ అప్లికేషన్లకు ఫీజు ఉండదని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వేల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తూ నిరుద్యోగుల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగానే తక్షణం అప్లికేషన్ ఫీజు లేకుండా స్వీకరించాలని డిమాండ్ చేశారు.

Latest News