Site icon vidhaatha

HCU వివాదంపై.. హైకోర్టు విచారణ వాయిదా

విధాత: HCU కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై పిటిషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీం కోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో హెచ్‌సీయూ భూములపై సోమవారం విచారణ జరిగింది. సుప్రీం కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున ఈనెల 24కు విచారణ వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

ఈనెల 24 లోపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే స్టేటస్ రిపోర్టు ఫైల్ చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

HCU కంచ గచ్చిబౌలి భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినవి అంటూ వట ఫౌండేషన్, వర్సిటీ విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఇద్దరి పిటిషన్లపై గత విచారణ సందర్భంగా సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం భూముల వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం కూడా సంబంధిత పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

మరోవైపు కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై ఈ నెల 3న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అన్ని రకాల చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఫేక్ ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

కంచ గచ్చిబౌలి భూముల వివాదం జాతీయస్థాయికి వెళ్లడం.. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేయడంతో అప్రతిష్టపాలయ్యమన్న ఆలోచనతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ వివాదంలో తప్పుడు, మార్ఫింగ్‌ చేసిన వీడియోలపై వాదించే బాధ్యతలను ప్రభుత్వం సీనియర్‌ అడ్వకేట్‌ మేనకా గురుస్వామికి అప్పగించింది. ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేలా..విద్యార్థులను రెచ్చగొట్టెలా పోస్టులు పెట్టిన కిషన్‌రెడ్డి, కేటీఆర్‌, ప్రముఖులపై కేసులు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.

కంచ గచ్చిబౌలి భూములపై ఏఐని (AI) ఉపయోగించి కొన్ని వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయడంపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు క్రిశాంక్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈనెల 9 , 10 , 11 న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Exit mobile version