Heavy Rains | హైదరాబాద్ : గత రెండు రోజుల నుంచి రాజధాని హైదరాబాద్( Hyderabad ) వ్యాప్తంగా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షానికి( Heavy Rains ) హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. వరద నీటితో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులు, వాహనదారులు కూడా గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు.
అయితే ఇలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆగస్టు 9వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాబోయే నాలుగు రోజుల్లో 64.5 మి.మీ. నుంచి 115.5 మి.మీ. మధ్య వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మంగళవారం శేరిలింగంపల్లిలో అత్యధికంగా 30.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చందానగర్‌లో 28 మి.మీ., రామచంద్రాపురంలో 17 మి.మీ, పటాన్‌చెరులో 12.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.