Site icon vidhaatha

హుజూరాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ త్వరలో ఖరార్ .. నాయుకులు హుషార్

విధాత:హుజూరాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ శుక్ర లేదా శనివారం వెలువడనుందా? ఈ మేరకు ప్రధాన రాజకీయ పార్టీలకు సంకేతాలందాయా? వారం రోజులుగా ముమ్మరంగా సాగుతున్న ఆయా పార్టీల కార్యకలాపాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఈనెల 16న సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభిస్తారని తొలుత ప్రకటించారు. అయితే బుధవారం వాసాలమర్రి దళితవాడను సీఎం సందర్శించిన నేపథ్యలో దళితబంధు లబ్దిదారుల ఎంపిక, గురువారం చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించడానికి హుజూరాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూలు విడుదల సంకేతాలందడమే కారణమనే ప్రచారం సాగుతోంది.

టీఆర్‌ఎస్‌లో పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేరికలకు సీఎం కేసీఆర్‌ స్వయంగా హాజరవడం, కౌశిక్‌రెడ్డిని మూడ్రోజుల క్రితం గవర్నర్‌ కోటాలో శాసనమండలికి నామినేట్‌ చేయడం వంటి పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. మంత్రి హరీశ్‌రావు.. హుజూరాబాద్‌లో పార్టీ సమన్వయంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. మరో మంత్రి గంగుల కమలాకర్, ఇతర ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. దీనికంతటికీ ఉపఎన్నిక షెడ్యూలుపై సంకేతాలు రావడమే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి

Exit mobile version