విధాత, హైదరాబాద్ : కారులో మంటలు(Car Fire) చెలరేగి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు (Driver Death). మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా( Medchal-Malkajgiri) శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై లియోనియో రెస్టారెంట్ సమీపంలో ఆదివారం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన వివరాల ప్రకారం.. డ్రైవర్ వాహనాన్ని రింగ్ రోడ్డు పక్కన ఆపి ఏసీ వేసుకొని కారులోనే నిద్రిస్తున్న సమయంలోనే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.
అకస్మాత్తుగా మంటలు చెలరేగడం..ఆటోమెటిక్ డోర్ లాక్ లు తెరుచుకోకపోవడంతో డ్రైవర్ కారులోనే చిక్కుకుపోయి..బయటికి రాలేక సజీవదహనమయ్యాడు. మంటలలో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారులో మంటలు ఎలా వచ్చాయన్నదానిపై వివరాలు సేకరిస్తున్నారు.
