విధాత, హైదరాబాద్: ఐబొమ్మ(iBOMMA) వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి( Ravi)ని తెలంగాణ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ (arrest) చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని కూకట్ పల్లిలో అరెస్టు చేశారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వహిస్తున్న రవి తెలుగు సినిమాలను, ఓటీటీ కంటెంట్ ను పైరసీకి పాల్పడుతు..తన వైబ్ సైట్ లో ప్రదర్శిస్తున్నాడు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్ డీ ప్రింట్ పైరసీ చేసి ఐబొమ్మలో ప్రదర్శిస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ తెలుగు సినీ నిర్మాతలు పోలీసులకు ఐబొమ్మపై ఫిర్యాదు చేశారు. నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొంత కాలం క్రితమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దమ్ముంటే పట్టుకోండి అంటూ గతంలో ఐబొమ్మ నిర్వాహకుడు రవి పోలీసులకు సవాల్ విసిరాడు.
నన్ను అరెస్టు చేస్తే సినీ పరిశ్రమతో పాటు, పోలీసుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ బెదిరించాడు. తన వెబ్‌సైట్‌పై కన్నేస్తే అందరి జీవితాలు రోడ్డున పడేస్తానంటూ హెచ్చరించాడు. దీంతో పోలీసులు గత 6 నెలలుగా రవి కోసం గాలిస్తున్నారు. రవి శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అనంతరం రవి బ్యాంకు ఖాతాలోని రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సర్వర్లు ఓపెన్ చేసి వెబ్ సైట్ కంటెంట్ ను పరిశీలిస్తున్నారు. ఐబొమ్మ పైరసీ చర్చల కారణంగా సినీ పరిశ్రమకు దాదాపు రూ.3వేల కోట్ల వరకు నష్టం జరిగిందని గతంలో పోలీసులు వెల్లడించారు.
