తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలి … సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసు ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు, నగదు ప్రోత్సాహాకాలు కల్పిస్తామని ఇందుకు సంబంధించి శాసనసభలో చర్చించి చట్టాన్ని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

  • Publish Date - July 2, 2024 / 03:31 PM IST

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసు ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు, నగదు ప్రోత్సాహాకాలు కల్పిస్తామని ఇందుకు సంబంధించి శాసనసభలో చర్చించి చట్టాన్ని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద.. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో , తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంబంధించిన కొత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమేనని, నేరగాళ్లకు కాదన్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం ప్రభుత్వ బాధ్యత అని, అందుకే పోలీస్ వ్యవస్థకు కావాల్సిన నిధులు, అధికారులను కేటాయించామన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్ అని, నేరాలను ఎదుర్కోవడంలో రాష్ట్రంలో సైబర్ క్రైం టీమ్ సమర్ధవంతంగా పని చేస్తోందన్నారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. డ్రగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతాయని, ఉద్యమాలకు కేరాఫ్‌గా ఉన్న తెలంగాణలో దురదృష్టవశాత్తు గల్లీ గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిందన్నారు. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయన్నారు. చిన్నారులపై దాడులకు కారణం మాదకద్రవ్యాలేనని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ యువకులు డ్రగ్స్ కు బానిసలు కాదని, సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలన్నారు.

టికెట్లు పెంచమని వచ్చే సినిమా బృందంతో షార్ట్ వీడియోలు

డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాల్లో సినిమా పరిశ్రమ కూడా భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సినిమా టికెట్ల రేట్లు పెంచాలని దరఖాస్తులు చేసుకునే చిత్ర బృందాలతో డ్రగ్స్, సైబర్ క్రైమ్‌లకు వ్యతిరేకంగా షార్ట్ వీడియోలతో ప్రచార వీడియోలను రూపొందించేలా చూడాలని, అలాంటి కండిషన్ పాటించిన వారికే ప్రభుత్వ వెసులుబాట్లు, సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం త్వరలో సినీ రంగ ప్రముఖులతో, థియేటర్ల వారితో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినీ పరిశ్రమపై ఉందన్నారు. ప్రతీ సినిమా థియేటర్ లో సినిమాకు ముందు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ కు సంబంధించి వీడియో ఉచితంగా ప్రదర్శించేలా చూడాలన్నారు. ఈ నిబంధనలకు సహకరించినవారికే అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో వీడియో యాడ్ ద్వారా భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని తాను అభినందిస్తున్నానన్నారు. మీడియా కూడా రాజకీయ వివాదాలపై కాకుండా సమాజంలో సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్ నిర్మూలన కార్యక్రమాలపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని, సామాజిక బాధ్యత కోణంలో తమ పత్రికలు, ప్రచార సాధనాల్లో డ్రగ్ వ్యతిరేక యాడ్‌లను ప్రచారం చేయాలని కోరారు. పీవీ సింధూ, సానియామీర్జా సహా ప్రముఖ క్రీడాకారులు, సెలబ్రేటీలను డ్రగ్స్‌, సైబర్ క్రైమ్ వ్యతిరేక ప్రచారంలో భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Latest News