బీఆరెస్‌, కాంగ్రెస్‌కు కొత్త గుబులు

హుజూర్‌ నగర్ నియోజకవర్గంలో అధికార బీఆరెస్‌, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కు కొత్త గుబులు పట్టుకుంది. నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల నేతలు పోటీకి సై అంటున్నారు

– రంగంలోకి స్వతంత్రులు, ఇతర పార్టీలు

– ఇరు పార్టీల్లో చీలనున్న ఓట్లు

– ఏ పార్టీకి లాభమో.. సస్పెన్స్‌!

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్‌ నగర్ నియోజకవర్గంలో అధికార బీఆరెస్‌, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కు కొత్త గుబులు పట్టుకుంది. నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల నేతలు పోటీకి సై అంటున్నారు. వీరు చీల్చే ఓట్లు ఎవరికి లాభాపడతాయో అన్న ఆయోమయం నెలకుంది. ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ఆపార్టీ నాయకుల్లోని అసంతృప్తులు, పార్టీ ఫిరాయింపులు, సంక్షేమ పథకాల అమల్లో జరిగిన అవకతవకలు, సామాన్య ప్రజలను పట్టించుకోకపోవడం లాంటి ఎన్నో అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి కూడా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. స్వతంత్ర అభ్యర్థులు, ఫార్వార్డ్ బ్లాక్ లాంటి పార్టీ లు బెంబేలెత్తిస్తున్నాయి. విస్తృత ప్రచారాలతో ప్రజల్లోకి వెళుతున్న ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పెద్ద తలనొప్పిగా మారాఉ.

వెంటాడుతున్న స్వతంత్రులు, సింహం గుర్తు

హుజూర్‌ నగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి కి సైతం సింహం భయం వెంటాడుతున్నట్లు సమాచారం. ఓజో ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి, గ్రామీణ ప్రజల్లోకి వెళ్లిన యువ నాయకుడు పిల్లుట్ల రఘు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆయన నియోజకవర్గంలోని దళిత, గిరిజన, బహుజన వర్గాలను ఆకర్షిస్తూ ఇప్పటికే తన ఫౌండేషన్ పేరుతో చేపట్టిన అనేక కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుస్తాయని ఆశిస్తున్నారు. తాజాగా ప్రారంభించిన ఎన్నికల ప్రచారంలో దళిత, గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఓజో ఫౌండేషన్ పేరుతో రఘు చేపట్టిన నిరుద్యోగులకు ఉచిత శిక్షణలు, ఆర్థిక సహకారం, సేవా కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి వెళ్లాయి. ఇవి స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి తో పాటు కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తంకుమార్ రెడ్డికి మింగుడు పడడం లేదు.

ఫిరాయింపులపై ఉత్తమ్‌ నజర్‌

హుజూర్‌ నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగిన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి ఎన్నికల రణరంగంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అధికార బీఅరెస్ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వలస నేతలపై ఉత్తమ్‌ ఓ కన్నేసినట్లు కనబడుతోంది. ఆయన వారిని విశ్వసిస్తలేరనే ప్రచారం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో బలంగా వినబడుతోంది. ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం ఊగిసలాటలో ఉన్నట్లు సమాచారం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పార్టీలు మారే నాయకులపై ఉత్తమ్‌ నజర్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే సైదిరెడ్డి పై తీవ్ర వ్యతిరేకత

హుజూర్‌ నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిపై స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని ఆయన పక్కన పెట్టారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. భూకబ్జాలు, దందాలు, ఎమ్మెల్యే పేరుతో కిందిస్థాయి లీడర్లు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావనే చర్చ సాగుతోంది. సంక్షేమ పథకాలు కూడా కేవలం బీఆరెస్‌ కార్యకర్తలకే ఇచ్చారన్న అపవాదు ఉంది. ఇది ఆయనకు పెద్ద మైనస్ అయింది. పంచాయితీలు, సెటిల్మెంట్లతో ఎమ్మెల్యే బిజీగా ఉంటూ, సామాన్య ప్రజలను పట్టించుకోలేదనే ఆరోపణ సైతం ఉన్నాయి. దీంతో సామాన్యులు, కిందిస్థాయి లీడర్లు, గిరిజనులు, యువతలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీరంతా సింహం గుర్తు పంచన చేరుతున్నట్లు ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆరెస్‌ నేతలను సింహం గుర్తుతో పాటు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు భవిష్యత్తులో ఆందోళనలోకి నెట్టనున్నాయి. చాప కింద నీరులా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత పిల్లుట్ల రఘు ప్రచారం సాగిస్తున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ అభ్యర్థులను ఎన్నికల వేళ సంశయంలోకి నెట్టేస్తోంది. వారి ప్రచారానికి ఎలా అడ్డుకట్ట వేస్తారో, ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం.. ప్రచార వేడి పెరుగుతుండడంతో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాలి.

Latest News