విధాత, హైదరాబాద్ : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి( Revanth Reddy Government) కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరల పథకం(Indira Mahila Shakti Sarees)పై నెట్టింటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు రంగురంగుల బతుకమ్మ చీరలు(Batukamma Sarees) ఇవ్వగా..రేవంత్ ప్రభుత్వం మాత్రం యూనిఫాం(Uniform) లెక్క అందరికీ ఒకే రంగు చీరల పంపిణీ చేయడంపై ట్రోలింగ్ సాగుతుంది. అసలు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారా ? లేక యూనిఫామ్ ఇచ్చారా? అంటూ నెట్టింట్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా(BRS Social Media) వర్గాలు ట్రోల్స్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ హాయంలో పంపిణీ కాబడిన రంగుల బతుకమ్మ చీరల ఫోటోలు ఓ వైపు..రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరల ఫోటోలను మరోవైపు ఎక్స్ లో పోస్టు చేసి మరీ..రెండు ప్రభుత్వాలు పంపిణీ చేసిన చీరల మధ్య వ్యత్యాసాలను నెటిజన్ల ముందుంచారు. అందరి చీరలు ఒకేలా ఉంటే..ఏదైనా శుభ కార్యాలకు, కార్యక్రమాలకు పోయేదెట్లా అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రశ్నిస్తుంది. ఇది మహిళల అభిప్రాయం అని చెబుతుంది.
కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్
అయితే దొరల పాలనలో నాసిరకం చీరలు..ప్రజాపాలనలో నాణ్యమైన ఇందిరమ్మ చీరల పంపిణీ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా వర్గాలు కౌంటర్ ఎటాక్ (Congress Counter)చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర రావు, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ తదితరులు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల డిజైన్‌ను ఎంపిక చేయగా, వాటి ఆధారంగా సిరిసిల్ల నేత కార్మికులు చీరలు సిద్ధం చేశారు. ఓక్కో చీరకు ప్రభుత్వం రూ.800 చొప్పున ఖర్చు చేసింది. వాటిని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు, తెల్లరేషన్ కార్డు కుటుంబాల మహిళలకు పంపిణీ చేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు, అలాగే 18 ఏళ్లు నిండిన ఆడపడుచులందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు, పట్టణాల్లో 35 లక్షల చీరల చొప్పున మొత్తం దాదాపు కోటి చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బతుకమ్మ చీరలతో పోల్చితే ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు నాణ్యతలో మెరుగ్గా ఉన్నప్పటికి..అన్ని ఒకే రకం కలర్..డిజైన్లు ఉండటం కొంత అసంతృప్తి వినిపిస్తుందంటున్నారు.
