Site icon vidhaatha

Jishnu Dev Varma | త్రిపుర గవర్నర్‌గా తెలంగాణ వ్యక్తి.. తెలంగాణ గవర్నర్‌గా త్రిపుర వ్యక్తి.. కేంద్రం వ్యూహం ఏమిటో..!

Jishnu Dev Varma : తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

కేంద్రం ఇటీవల దేశంలోని 9 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. వీరిలో ఏడుగురిని కొత్తగా నియమిస్తూ.. ముగ్గురిని ఒకచోట నుంచి మరోచోటికి బదీలీ చేస్తూ శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ఉత్తర్వులు జారీ చేశారు. ఆ క్రమంలో తెలంగాణకు నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ నియమితులయ్యారు.

జిష్ణుదేవ్ వర్మ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఆయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వారు. 66 ఏళ్ల జిష్ణుదేవ్ వర్మ 1990లో బీజేపీలో చేరారు. 2018 నుంచి 2023 వరకు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రామ జన్మభూమి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వర్మ త్రిపుర డిప్యూటీ సీఎంగానే కాకుండా భారత బ్యాడ్మింటన్ అసోషియేషన్‌కి అధ్యక్షుడిగా సేవలందించారు.

ఈయనను తెలంగాణకు గవర్నర్‌ని చేయడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియమించిన కేంద్రం.. త్రిపురకు చెందిన బీజేపీ నేతను తెలంగాణ గవర్నర్‌గా నియమించింది. దాంతో ఇందులో రాజకీయ వ్యూహం ఉందని చర్చ మొదలైంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ గవర్నర్ వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే చర్చలు వినిపిస్తున్నాయి. జిష్ణుదేవ్ వర్మ కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి సవాలే అవుతుంది. అలా కాకుండా ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Exit mobile version