Site icon vidhaatha

Etala Rajender | జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి లేదంటే వ్యతిరేకత తప్పదు : ఎంపీ ఈటల రాజేందర్‌

విధాత, హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏటా 2లక్షల ఉద్యోగాల భర్తీ దిశగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నిరుద్యోగుల సమస్యలపై శనివారం ఇందిరాపార్క్‌ వద్ద బీజేవైఎం నిర్వహించిన మహాధర్నాలో ఈటల మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో కంటే.. రేవంత్ ప్రభుత్వంలో పోలీసులు రెచ్చిపోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రమే ఓటర్లు కాదు.‌. ప్రజలే మళ్లీ ఓట్లు వేయాలన్న విషయం రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్ల తర్వాత ప్రజల దగ్గరకు రావాలని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రేవంత్‌కు వందేళ్ల కోసం ప్రజలు అధికారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. భేషజాలకు పోకుండా జాబ్ క్యాలెండర్‌ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఇచ్చిన హామీలనే నిరుద్యోగులు అడుగుతున్నారని గుర్తుచేశారు. అమలు చేసే దమ్ముంటేనే ఎన్నికల్లో హామీలు ఇవ్వాలని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ నిర్ణేతలనే విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు. గ్రూప్ -1లో 01:100 ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంట్లో ఇబ్బంది లేకపోవచ్చు కానీ నిరుద్యోగులది ఇల్లు గడవని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళ్ల కిందకి నీళ్లు వస్తే.. రేవంత్ రెడ్డికి తెలుస్తుందని చెప్పారు. రేవంత్ చేసే మంచి, చెడు ఏంటో నిరుద్యోగులు లెక్క కడుతున్నారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.

Exit mobile version