Site icon vidhaatha

తెలంగాణ‌లో బీజేపీదే అధికారం: ప్రధాని మోదీ

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ప్రజలు ట్రైలర్ చూపించారని, ఈ ఎన్నికల్లో ఆయనకు పూర్తి సినిమా చూపిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణాలో కె.సి.ఆర్. పని అయిపోయిందని, ఇక్కడ తొలిసారి బి.జె.పి. ప్రభుత్వం ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. బి.జె.పి. ప్రభుత్వంలో బి.సి. సామాజిక వర్గానికి చెందిన వారే ముఖ్యమంత్రి అవుతారని పునరుధ్ఘాటించారు.



సోమవారం కరీంనగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. రానున్న ఐదేండ్లలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అందుకోసం రాష్ట్రంలో బి.జె.పి. ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మార్పుకు సంబందించిన గాలి వీస్తోందని, ఈ ఎన్నికల్లో మార్పు తథ్యం అని జోస్యం చెప్పారు. వచ్చే ఐదేండ్లు తెలంగాణ భవిష్యత్తుకు చాలా కీలకం అని ప్రధాని అన్నారు. పదేండ్ల బాలుడి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచిస్తారని చెప్పిన ఆయన పదేండ్ల వయసున్న తెలంగాణ కూడా వచ్చే ఐదేండ్లు అంతే కీలకం అన్నారు.


ప్రజలను మోసం చేయడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని బి.ఆర్.ఎస్., కాంగ్రెస్ వొదిలిపెట్టడం లేదని, ఆ రెండూ కుటుంబ పార్టీలేనని ఆయన అన్నారు. దేశ ప్రధానిగా పి.వి.ని తెలంగాణ అందించిందని, దేశానికి మార్గ నిర్ధేశం చేసే అవకాశం కల్పించిందని, అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంతగానో అవమానించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పి.ఎఫ్.ఐ. వంటి తీవ్రవాద సంస్థలకు ఊతం లభిస్తుందని ఆరోపించారు. రైతులకు నీళ్ల పేరుతో కె.సి.ఆర్. లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. పోలింగ్ రోజు ఎవ్వరైనా భాజాపాకు ఓటు వేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్లే అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా బి.ఆర్.ఎస్.ను దించేస్తాం.. కాంగ్రెస్ ను రానివ్వం.. అనే నినాదమే వినిపిస్తోందన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే తిరిగి కె.సి.ఆర్. ప్రభుత్వాన్ని కోరుకున్నట్లే అని పేర్కొన్నారు.

 

కరీంనగర్ ను స్మార్ట్ సిటీ చేద్దామంటే అడ్డుపడ్డ కె.సి.ఆర్. :

కరీంనగర్ ను స్మార్ట్ సిటీ చేస్తామంటే కె.సి.ఆర్. అడ్డుపడ్డారని చెప్పిన మోదీ, కరీంనగర్ పట్టణాన్ని లండన్ చేస్తానని అరచేతిలో వైకుంఠం చూపారన్నారు. కరీంనగర్ ను లండన్ చేస్తానన్న కె.సి.ఆర్. మాటలు ఏమయ్యాయని దుయ్యబట్టారు. కరీంనగర్ పట్టణానికి సి. వన్ హోదా కల్పించడం తమ లక్ష్యం అన్నారు. కరీంనగర్ ఫిలిగ్రికి పెట్టింది పేరని, అలాంటి కళను ప్రోత్సహించేందుకు కేంద్రం విశ్వకర్మ యోజనను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇందులో భాగంగా లక్షలాది రూపాయలను ఎలాంటి పూచికత్తు లేకుండానే ఇస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో ప్రజలకు కె.సి.ఆర్. కన్నీళ్లు, కష్టాలు మిగిల్చారని తెలిపారు. తెలంగాణను కె.సి.ఆర్. కుటుంబసభ్యుల కోసమే సాధించారా అని ప్రశ్నించారు. కుటుంబ పాలకులు వారి పిల్లల గురుంచే ఆలోచిస్తారని, ప్రజల పిల్లల గురుంచి ఆలోచించబోరని విమర్శించారు. బి.ఆర్.ఎస్. మునిగిపోయే నావ అని, ఆ పార్టీ వారికే అర్థమైందని అన్నారు. కుటుంబ సభ్యులంతా గెలుపు కోసం అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మద్యం కుంభకోణంపై విచారణ వేగవంతం అవుతుందన్నారు. కమలం పువ్వు గుర్తుపై ప్రజలు వేసే ప్రతి ఓటు తనలో శక్తిని మరింత పెంచుతుందని ఆయన తెలిపారు.



 


Exit mobile version