విధాత, హైదరాబాద్ : పాలకులు మారిన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం జలాల్ బాబా నగర్, భూపాల్ నగర్ బస్తీ వాసులకు ఇళ్ల పట్టాలు రాకపోవడం విచారకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమో వారితో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ జనంబాటలో భాగంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన పరిష్కారం కాని సమస్యలు ఉన్న చోటికి వెళ్తున్నాం అని, వాటిని ప్రభుత్వాల దృష్టికి తెచ్చి ఆ సమస్యల పరిష్కారానికి సర్కార్ పై ఒత్తిడి తెస్తాం అని తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ డివిజన్, భూపాల్ నగర్ వాసులకు 45 ఏళ్లుగా 25 ఎకరాల్లో 2 వేల కుటుంబాల వాళ్లు ఇళ్లు కట్టుకొని ఉంటున్నారని, అనేక పార్టీలు అధికారంలోకి వచ్చిపోయినప్పటికి వారికి ఇస్తామన్న ఇళ్ల పట్టాలు మాత్రం ఇవ్వలేదన్నారు.
ఫారెస్టుకు భూములిస్తేనే ఇళ్లకు పట్టాలు
బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీల వాళ్లు కూడా సమస్య పరిష్కారం కావాలని అంటున్నాయని, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పని మాత్రం జరగలేదని కవిత తెలిపారు. ఇప్పుడున్న ల్యాండ్ కు డబుల్ ల్యాండ్ ను ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, అప్పుడు మాత్రమే ఇక్కడి వాసులకు పట్టాలు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. ఆ పని వెంటనే చేట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇక్కడి ప్రజల సమస్య తీరాలంటే ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలన్నారు. జాగృతి ఆ పని చేస్తోందని. ఇక్కడి ప్రజలందరికీ పట్టాలు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం అని కవిత ప్రకటించారు.
