విధాత: తెలంగాణ రాజకీయాలలో ఏఐ చిచ్చు రేపుతోంది. హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఏఐ వీడియోలు, ఫోటోల దెబ్బకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం షేక్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఏఐ అంటేనే భగ్గమంటున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఏఐ కంటెంట్ ను స్వాగతిస్తూ తన కేడర్ కు ఏఐ గ్రోక్ ను విరివిగా వాడాలంటూ పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏఐ కంటెంట్ విశ్వసనీయత..గ్రోక్ వంటి వాటి సమాధానాలు ప్రపంచ వ్యాప్తంగా పూర్తిగా అన్ని అంశాల్లో వినియోగించతగ్గది కాదన్న వాదన ఉండనే ఉంది. ఇటీవల ప్రధాని మోదీ సహా భారత రాజకీయ పక్షాలపై ఏఐ గ్రోక్ హిందీలో చేసిన విమర్శలపై రేగిన రచ్చ ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. అయితే తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయడంలో ఏఐ పాత్ర ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రభుత్వాన్ని వణికించిన ఏఐ
హెచ్ సీయూ భూములను ప్రభుత్వం లాక్కున్నట్లుగా.. పర్యావరణ విధ్వంసం చేసి వన్యప్రాణులకు నష్టం చేసినట్లుగా సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా ఏఐ ఫేక్ వీడియోలు, ఫోటోలతో కృత్రిమంగా వివాదం సృష్టించడం సీఎం రేవంత్ రెడ్డికి ఆగ్రహానికి కారణమైంది. గతంలో ప్రభుత్వాలు హెచ్ సీయూ భూములను పలు సంస్థలకు కేటాయించినప్పుడు లేని వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు ఈ ధఫా ఏఐ కారణంగా తలెత్తాయని రేవంత్ రెడ్డి సమీక్షలో వెల్లడైంది. నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సీఎంకు వివరించారు. వివిధ రంగాల సెలబ్రేటీలు, కేంద్ర మంత్రులు వంటి వారు కూడా ఏఐ ఫేక్ కంటెంట్ నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని నివేదించారు.
ఏఐ కంటెంట్ నియంత్రణకు చట్టపర కసరత్తు
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేక్ కంటెంట్ తోనే హెచ్ సీయూ భూ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఫేక్ కంటెంట్ పై ప్రభుత్వం కోర్టుకెళ్లాలని కూడా నిర్ణయించారు. కంచ గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇదే తీరుగా ఇండో పాక్, ఇండో చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తుల్లో యుద్ధాలు జరిగే ప్రమాదముంటుందన్న ఆందోళన కూడా ఆయన వెలిబుచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్ ను మించిన మహమ్మారిలాంటివని కూడా అభిప్రాయపడ్డారు. ఏఐ ఫేక్ కంటెంట్ నియంత్రణకు తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ టూల్స్ లను సమకూర్చుకోవాలని సూచించారు. ఏఐ ఫేక్ కంటెంట్ లపై కేసులు కూడా నమోదు చేసింది.
ఏఐ హబ్ ప్రణాళికల సంగతేంటీ..?
సీఎం రేవంత్ రెడ్డి హెచ్ సీయూ భూ వివాదం నేపథ్యంలో ఏఐ ఫేక్ కంటెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు తెలంగాణను ఏఐ హబ్ గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాలను ప్రశ్నార్ధకం చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు భవిష్యత్తు అంతా ఏఐదే అంటూ ఇంకో వైపు ఏఐ వాడితే కేసులు పెడతామన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. రేవంత్ ఏఐ ఫేక్ కంటెంట్ వ్యాఖ్యలకు., ఏఐ హబ్ లక్ష్యంతో ఏఐ కంపనీలకు రెడ్ కార్పెట్ వేసేందుకు మధ్య ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దావో స్ వేదికగా పెద్ద ఎత్తున ఏఐ కంపెనీల పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఎంవోయూలు సైతం కుదుర్చుకుంది. ఏఐ ఫేక్ కంటెంట్ ను..ఏఐ సాంకేతిక విద్యా విస్తరణను వేర్వేరుగా చూడాలని అధికార పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి కేవలం ఏఐ ఫేక్ కంటెంట్ కు వ్యతిరేకంగా మాత్రమే స్పందించారని క్లారిటీ ఇస్తున్నాయి.
ఏఐ ప్రతిపక్షాల ఆయుధమా..?
హెచ్ సీయూ భూముల వివాదంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టేలా ఉద్యమాన్ని రాజేయడంలో ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా ఏఐ కంటెంట్ ను అయుధంగా వాడారనడంలో సందేహం లేదు. గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసినట్లుగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదాయం కోసం ప్రభుత్వ భూముల విక్రయానికి సిద్ధపడింది. అప్పుడు లేని ఉద్యమాలు ఇప్పుడెలా పుట్టుకొచ్చాయన్నది చర్చనీయాంశమైంది. హెచ్ సీ యూ వివాదంలో ప్రభుత్వ పొరపాట్లను పక్కన పెడితే భూముల విక్రయానికి వ్యతిరేకంగా విద్యార్ధుల పోరాటం..ప్రతిపక్షాల ప్రచార యుద్ధం విజయవంతమైంది. ప్రభుత్వం ఆకస్మాత్తుగా యూనివర్సిటీలో జేసీబీలతో చొరబడి చేపట్టిన చదును పనులు..చెదిరిపోయిన వన్యప్రాణులు, పచ్చదనం విధ్వంసం..విద్యార్థుల పోరాటాలు అన్ని కూడా ఏఐ కంటెంట్ వీడియోలుగా, ఫోటోలుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగాయి. అవి అసలువో..నకిలీవో నిర్ధారించుకోలేనంతగా క్షేత్ర స్థాయి పరిస్థితులకు అద్ధం పట్టడంతో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం వేగంగా జరిగిపోయింది.
సోషల్ మీడియాలో గులాబీ పార్టీదే పైచేయి
ఇప్పటికే అధికార కాంగ్రెస్ తో పోల్చితే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పైచేయిగా ప్రచార యుద్ధం సాగుతోంది. ఇప్పుడు ఏఐ కంటెంట్ కూడా దానికి తోడవ్వడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సోషల్ మీడియాలో మా వెనుకబాటే కారణమన్న కేటీఆర్ ఈ విభాగంలో పార్టీ వాయిస్ ను బలోపేతం చేశారు. తాజాగా బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాల్లోనూ కేసీఆర్ ఏఐ గ్రోక్ ను విరివిగా వినియోగించాలని పిలుపునివ్వడం గమనార్హం. అటు బీఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణలో ఇప్పటికే ఆ పార్టీకి అనుకూలంగా..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ గ్రోక్ అధారిత వరుస కథనాలు వెలువడుతున్నాయి. జనాన్ని కదిలించడంలో ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు చేయలేని పని.. సోషల్ మీడియా, ఏఐ కంటెంట్ ల ద్వారా చేయవచ్చన్న ఆలోచనకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రభావితం కావడమే కేసీఆర్ ఏఐ గ్రోక్ పిలుపుకు కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.