మాకు గ్రౌండ్ లేదన్న కేసీఆర్ మా చేతిలో ఎందుకు ఓడారు

బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలో బీజేపీకి గ్రౌండ్ లేదంటూ, ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఫేక్ అని, అది ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించిన కేసు అని చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్‌లు ఘాటుగా స్పందించారు

  • Publish Date - April 24, 2024 / 03:59 PM IST

బిడ్డ ప్రేమతో బీజేపీపై అక్కసు
కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ల మండిపాటు

విధాత, హైదరాబాద్: బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలో బీజేపీకి గ్రౌండ్ లేదంటూ, ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఫేక్ అని, అది ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించిన కేసు అని చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్‌లు ఘాటుగా స్పందించారు. బుధవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి గ్రౌండ్ లేదని, పార్లమెంటు ఎన్నికల్లో మాకు ఒక్క సీటు రాదన్న కేసీఆర్ బీజేపీ అభ్యర్థి చేతిలో కామారెడ్డిలో ఎట్లా ఓడిపోయారో మర్చిపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కక్షతో ప్రధాని మోదీ తమపై కక్ష కట్టి తన కూతురును లిక్కర్ కేసులో ఇరికించారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టినట్లుగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి..వరుస వలసలతో కేసీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారన్నారు. అవినీతి, కుటుంబ పాలన..అలవి కాని హామీల విషయంలో బీఆరెస్‌, కాంగ్రెస రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని విమర్శించారు. సికింద్రాబాద్ బీఆరెస్‌ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తనకు మంచి మిత్రుడని, ఆయనను బీఆరెస్ బలవంతంగా తనపై పోటీకి దించారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవబోతుందని, పార్లమెంటు ఎన్నికల అనంతరం బీఆరెస్ ఉనికి కోల్పోతుందన్నారు.

కేంద్రంలో మరోసారి ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలో రాబోతుందన్నారు. రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ మాట్లాడుతూ టైటానిక్ షిప్ లా కుప్పకూలిన బీఆరెస్‌ పార్టీని కేసీఆర్ బ్రతికించుకునే ప్రయత్నంలో అనేక అబద్దాలు మాట్లాడుతున్నారని, ప్రజలు ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో బీఆరెస్‌ పార్టీ ఖేల్ ఖతం దుకాణం బంద్ అని, ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. బీఆరెస్‌ పార్టీ వాళ్లు చేసిన పాపాలకే ప్రజలు గత ఎన్నికల్లో శిక్షించారని, అందుకే పార్టీ నేతలతో పాటు కేడర్‌ కూడా పార్టీని వీడుతున్నారన్నారు. లిక్కర్ కేసుపై కేసీఆర్ వ్యాఖ్యలు అసంబద్ధంగా రాజ్యాంగ సంస్థలు, కోర్టులను తప్పుపట్టే విధంగా ఉన్నాయని, బెయిల్ బీజేపీ ఇస్తుందా అని ప్రశ్నించారు.

బిడ్డ మీద ప్రేమతో బీజేపీపై అక్కసు వెళ్లగక్కుతున్నారని, లిక్కర్‌ కేసులో ఉన్నావాళ్లే లొంగిపోయి నిజాలు బయటపెడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. కేసీఆర్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని, ఆయన హోల్ సేల్ గా పార్టీ పిరాయింపులు ప్రోత్సహించి, మంత్రి పదవులిచ్చి దిగజారుడు రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. బీజేపీ ఏ ప్రభుత్వాన్ని కూలదోయదని, 8 సీట్లు ఉన్న బీజేపీ అధికారంలోకి వచ్చేది ఎలా సాధ్యమన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈసారి బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆరెస్‌ 17 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకుంటే గగనమని, ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదని, అన్ని పార్టీల కంటే బీజేపీ ఎక్కువ గెలవబోతుందని,లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

Latest News