Site icon vidhaatha

konda surekha । సమంతపై ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా : కొండా సురేఖ

konda surekha । సమంత, నాగచైతన్య విడాకులపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలంగాణ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్‌ చేశారు. కొండ సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున తొలుత స్పందిస్తూ ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. ఆయన భార్య అమల తీవ్ర పదజాలంతో ఒక పోస్టు పెడుతూ దయ్యం మాదిరిగా కొండాసురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీతోపాటు పలువురు ప్రముఖులు సైతం కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ సైతం కొండా సురేఖకు చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టు ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..’ అని సమంతను ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో ఆమె పేర్కొన్నారు. ‘నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు’ అని పోస్టు చేశారు. అయితే.. కేటీఆర్‌ను మాత్రం వదిలేది లేదని, అంతా ఆయనే చేసి తనను క్షమాపణ కోరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో తాను తీవ్రంగా మనోవేదన చెంది ఆయనను ఉద్దేశించి విమర్శలు చేసే క్రమంలో అక్కినేని కుటుంబం పేర్లు తీసుకున్నానని చెప్పారు. తనకు ఎవరిమీదా వ్యక్తిగత దురుద్దేశాలు లేవన్నారు. సమంత పోస్టు చూసి చాలా బాధపడ్డానని చెప్పారు. అందుకు రాత్రే బేషరతుగా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టు ట్వీట్‌ చేశానని తెలిపారు. తనకు వచ్చిన లీగల్‌ నోటీసుపై చట్టప్రకారమే ముందుకు వెళతానని సురేఖ తెలిపారు.

ఇదిలా ఉంటే.. కొండా సురేఖ ఆమె వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ వివాదానికి ఇక తెరదించాలని పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ సినీ ఇండస్ట్రీకి విజ్ఞప్తి చేశారు. ఆ వ్యాఖ్యలు తనను కూడా తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. కొండా సురేఖతో తాను మాట్లాడానని, వివరణ ఇవ్వాలని కోరానని తెలిపారు. మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలు, మంత్రులను మహేశ్‌ గౌడ్‌ కోరినట్టు కాంగ్రెస్‌ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.

Exit mobile version