Site icon vidhaatha

KTR | కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయండి … ఎల్‌ఎండీ సందర్శనలో కేటీఆర్‌

శాసన సభ వేదికగా నిలదీస్తాం
మేడిగడ్డపై ప్రభుత్వ ప్రచారం ఉత్తదే అని తేలిపోయింది

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌజ్‌ల ద్వారా నీళ్లను ఎత్తిపోయకుండా సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తుందని, లక్షలాదిమంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గురువారం బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి లోయర్ మానేరు డ్యాంను సందర్శించారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఎల్‌ఎండీలో గతంలో ఇదే నెలలో 24టీఎంసీలు పంపింగ్ చేసి నింపామన్నారు. ఇప్పటికే 45శాతం తక్కువ వర్షాపాతం నమోదైందని, ఇంకోవైపు గోదావరిలో లక్షల క్యూసెక్కులు వృధాగా పోతున్నాయని, అధికారులు మాత్రం పంపింగ్‌పై నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో శాసన సభ సమావేశాలు జరుగుతున్న వేళ కాళేశ్వరం పరిధిలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు లోయర్‌, మిడ్ మానేరు, ఎస్సారెస్పీ, కాళేశ్వరం పంప్‌హౌజ్‌లు, రిజర్వాయర్లను పరిశీలించేందుకు వచ్చామన్నారు. గోదావరిలో నీళ్లు దిగువకు వృధాగా వెలుతుంటే పంపింగ్ చేయని ప్రభుత్వ వైఖరితో రైతులు ఆందోళన చెందుతున్నారని, రాజకీయ కక్షతో కాళేశ్వరం స్కీమ్‌లో పంపింగ్ చేయకపోతే, తక్కువ వర్షాలు పడితే ప్రజలకు నష్టం చేసే పరిస్థితి తేవడం సరికాదన్నారు. శ్రీరాంసాగర్‌, మిడ్‌, లోయర్ మానేరులలో 140టీఎంసీలకు గాను 30టీఎంసీలు కూడా లేవన్నారు. మల్లన్న సాగర్‌లో 50టీఎంసీలు, కొండపోచమ్మలలో 15టీఎంసీలు నింపితే హైదరాబాద్ సహా మధ్యన వచ్చే జిల్లాలన్నింటికి తాగు, సాగు నీటి వసతి కల్పించవచ్చన్నారు. మేడిగడ్డ మేడిపండు అని, లక్షల కోట్లు కొట్టుకపోయాని, కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు చేసిన రాజకీయ విమర్శలన్ని ఉత్తవే అని తేలిపోయిందన్నారు. ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెలను శాసన సభ సమావేశాల సమయంలో ప్రజల దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో కేసీఆర్ సూచన మేరకు కాళేశ్వం ప్రాజెక్టు సందర్శ పెట్టుకున్నామన్నారు. 10లక్షల క్యూసెక్కుల వరద నీరు పోతున్నా మేడిగడ్డ ఠీవిగా నిలబడిందన్నారు. 10లక్షల క్యూసెక్కులు కిందకు పోతున్నందునా రైతుల కోసం కన్నెపల్లి పంప్‌హౌజ్ నడిపించి రిజర్వాయర్లను నింపి పెట్టాలని కోరుతున్నామన్నారు. మేం చెప్పామని రాజకీయ కక్షకు పోకుండా రైతుల కోసం గోదావరి నీళ్లను ఎత్తిపోయాలన్నారు. 240టీఎంసీలను పంపింగ్ చేసుకోవచ్చని, 24లక్షల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చన్నారు. కాళేశ్వరం స్కీమ్ పరిధిలో ఎందుకు పంపింగ్ చేయడం లేదన్న దానిపై శాసన సభలో నిలదీస్తామన్నారు. శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్‌హౌజ్‌, శ్రీరాంసాగర్‌, కాళేశ్వరం పరిధిలోని అన్ని స్ట్రక్చర్‌లను సందర్శిస్తామని తెలిపారు.

Exit mobile version