Local Body Elections | హైదరాబాద్ : గ్రామ పంచాయతీల్లో స్థానిక సంస్థల ఎన్నికల( Local Body Elections )హడావుడి మొదలైంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక పోటీ చేసేందుకు కావాల్సిన ధృవపత్రాలను కూడా అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో మండల కార్యాలయాల్లో సందడి నెలకొంది. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లను( Nominations ) సమర్పించే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ కథనంలో తెలుసుకుందాం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన వివరాలను సమర్పించాలి. ఇద్దరు సాక్షులు ధృవీకరించిన అఫిడవిట్‌ను నామినేషన్ పత్రంతో పాటు దాఖలు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల నియమావళి స్పష్టంగా పేర్కొంది.
అఫిడవిట్లో పొందుపరచాల్సిన విషయాలు ఇవే..
- జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు నేరపరమైన పూర్వాపరాలు, సివిల్, క్రిమినల్ కేసులు, విధించిన శిక్షలు, కోర్టుల్లో పెండింగ్ కేసుల వంటి వివరాలతో పాటు తమకు సంబంధించిన స్థిర, చరాస్తులు, అప్పులు, విద్యార్హతలను విధిగా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది.
- అభ్యర్థి తనతో పాటు కుటుంబ సభ్యులైన భార్య, కుమార్తె, కుమారుడికి సంబంధించిన వివరాలను సైతం నామినేషన్ పత్రంలో పొందుపర్చాలి.
- ఒకవేళ కుమార్తెకు వివాహమైతే ఆమె వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. కుమారుడికి వివాహమైతే కోడలి వివరాలు తప్పకుండా పేర్కొనాలి. కుమారుడు, కోడలు కుటుంబం విడిగా నివసిస్తుంటే ఆమె అవసరం ఉండదు.
- నామపత్రంతో పాటు అందించే ధ్రువీకరణ పత్రంలో గడిని ఖాళీగా వదిలేయరాదు. తనకు వర్తించదని, లేదా నదారత్ అని రాయాల్సి ఉంటుంది. లేదంటే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.
- అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు ఇంకా పూర్తి వివరాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అదే రోజు ప్రదర్శిస్తుంది. స్వీయ ధ్రువీకరణ తప్పుగా ఇచ్చినట్లు రుజువైతే క్రిమినల్ కేసు నమోదవుతుందని ఎన్నికల నియమావళి స్పష్టంగా పేర్కొంది. కాబట్టి పై వివరాలను తప్పనిసరిగా నామినేషన్ పత్రంలో పొందుపరచాల్సిందే.