విధాత, వరంగల్ ప్రతినిధి: సిపిఐ మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి,సౌత్ బస్తర్,డివిజనల్ కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కి చెందిన మంద రూబెన్, కన్నన్న, మంగన్న, సురేష్(67) వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎదుట మంగళవారం లొంగిపోయాడు.ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా, హసన్ పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందిన మంద రూబెన్, కన్నన్న, మంగన్న, సురేష్ 1979 సంవత్సరంలో కాజీపేటలోని ఆర్ఈసిలో హాస్టల్ మెస్ విభాగంలో పనిచేస్తున్న సమయంలో రాడికల్స్ పట్ల ఆకర్షితుడై పార్టీ నేత, ఆర్ఈసి పూర్వ విద్యార్థి నంబాల కేశవరావు పిలుపు మేరకు ఆ ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.1981నుండి 1986 వరకు నేషనల్ పార్క్ దళ సభ్యుడిగా 987లో ఏరియా కమిటీ సభ్యుడిగా కుంట, బస్తర్ ప్రాంతాల్లో పనిచేశారు. 1991లో చత్తీస్ ఘడ్ పోలీసులు అరెస్ట్ చేసి జగదల్పూర్ జైలు తరలించారు. సంవత్సరం తర్వాత జైలు నుండి తప్పించుకుని పార్టీలో కలిసి ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేసాడు. గుండ్రాయి గ్రామానికి చెందిన పొడియం భీమే ను వివాహం చేసుకున్నారు. 2005లో అనారోగ్యం కారణంగా గుండ్రాయి గ్రామంలోనే భార్య, పిల్లలతో నివాసం వుంటూ, కోళ్లు, గొర్రెలు ఫారాలు నిర్వహిస్తు జీవిస్తున్నాడు. గ్రామ కమిటీలతో కలసి పని చేస్తూ దళ సభ్యులకు షెల్టర్, భోజన వసతులను కల్పిస్తూ, పోలీసుల కదలికలను గమనిస్తూ మావోయిస్టులకు సమాచారం అందించేవాడు. తాజాగా అనారోగ్యం బాధపడుతున్న రూబెన్ మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడని చెప్పారు. ఆయన పై 8లక్షల రూపాయల రివార్డ్ వుందని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.