బలపడుతున్న కార్పొరేట్ పెట్టుబడి
యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గాదగోని రవి
విధాత, వరంగల్ ప్రతినిధి: స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలైనా 80 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గాదగోని రవి అన్నారు. బడా కార్పొరేట్ వర్గాల చేతుల్లో దేశ సంపద కేంద్రీకృతం కావడం బాధాకరమన్నారు. హన్మకొండలో పెద్దారపు రమేష్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ దేశంలో అన్ని బూర్జువా పార్టీల పాలన కూడా చూసాం కాబట్టి, అసమానతలు రూపు మాపి, సమానత్వం సోషలిజం కోసం ఏకైక ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులంతా ఐక్యం కావాల్సిన అనివార్యత నెలకొందని వివరించారు. ప్రత్యామ్నాయ ఆర్ధిక సామాజిక ఎజెండా లేకుండా ఈ దేశ సమస్యలు పరిష్కారం కావని, ఇందు కోసం తక్షణమే వామపక్ష కమ్యూనిస్టు పార్టీల ఐక్యత ప్రత్యామ్నాయ సంఘటన నిర్మాణం అవసరమన్నారు. అందుకే యంసిపిఐ(యు) శ్రేణులు ప్రజా క్షేత్రంలో విస్తృతంగా వెళ్ళాలని పిలుపు నిచ్చారు.
– రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవాలి
బీఆరెస్ ప్రభుత్వం అనుసరించిన ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాల వలన ఆ పార్టీని ప్రజలు తిరస్కరించిన తీరును కాంగ్రెస్ పార్టీ గుణపాఠం తీసుకోవటం లేదని రవి ఆవేదన వ్యక్తంచేశారు. దీని ఫలితంగా ప్రజలను విభజించు, పాలించు సూత్రంతో మతోన్మాద ఏజెండా ను బలపరిచే బిజెపి తెలంగాణ పోరాట గడ్డలో బలపడుతున్నదన్నారు. కాంగ్రెస్ తప్పుడు పాలనా విధానాలను బిజెపి ఉపయోగించు కోకుండా ప్రజా, వామపక్ష, సామాజిక ప్రత్యామ్నాయం కోసం యంసిపిఐ(యు) నిరంతరం కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి, వస్కుల మట్టయ్య, కుంభం సుకన్య, వనం సుధాకర్, మంద రవి, గడ్డం నాగార్జున తదితరులు పాల్గొన్నారు.