సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ఆగ్రహం సమయపాలన పాటించాలని .. మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం సచివాలయంలోని తన శాఖ విభాగంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలో ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు మంత్రి వెళ్లారు

  • Publish Date - July 3, 2024 / 07:45 PM IST

విధాత,హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం సచివాలయంలోని తన శాఖ విభాగంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలో ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు మంత్రి వెళ్లారు. అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్‌ఆండ్‌బీ విభాగంలో ఆకస్మికంగా తనిఖీ చేయగా ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడంతో షాక్ తిన్నారు. సమయం దాటినా చాలా మంది ఉద్యోగులు కార్యాలయానికి రాకపోవడంతో మంత్రి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఉద్యోగులు ఉదయం 10 గంటలకు కార్యాలయానికి రిపోర్టు చేయాలి. తెలంగాణ సచివాలయంలో ఉదయం 11.00 గంటలైనా 80 శాతం ఉద్యోగులు ఆఫీసులకు రాకపోవడంపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసిస్టెంట్, అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు కూడా ఆఫీసులకు ఆలస్యంగా రావడంపై ప్రశ్నించారు. 11గంటల వరకు రాలేదని, మళ్లీ సాయంత్రం 6గంటల కల్లా వెళ్లిపోతారని, మళ్లీ మధ్యలో ఆఫ్ అంటూ.. అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరుతో పాటు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి.. కొన్ని విషయాలపై అధికారులు స్పందించకపోవడంతో మీ వివరాలు కూడా మీకు తెలుసా? అంటూ ఫైర్ అయ్యారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలని వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే కొనసాగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మంత్రి వచ్చినప్పటి వరకు ఉద్యోగులు రాకపోవడం ఏంటని మండిపడ్డారు. ఉద్యోగులు రోజూ ఇలానే వస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. మొదటిసారి తనిఖీ కావడంతో.. వదిలేస్తున్నానని ఇదే మళ్లీ రిపీట్ అయితే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.

Latest News