హైదరాబాద్, సెప్టెంబర్ 10(విధాత): నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ఐ&పిఆర్ స్పెషల్ కమీషనర్ సిహెచ్. ప్రియాంక, సీపీఆర్‌వో జి. మల్సూర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా అక్రిడిటేషన్ పాలసీ, జర్నలిస్టుల హెల్త్ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి హైపవర్ కమిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలపై కార్మిక, ఆరోగ్య, హోం, ఆర్ధికశాఖ అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.