స్వచ్చదనం..పచ్చదనం విజయవంతం
సర్పంచ్ ఎన్నికల వరకు ఇదే స్ఫూర్తితో సాగాలి
మహిళా శక్తి సంఘాలను బలోపేతం చేయాలి
విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం విజయవంతమైందని, ఇందుకు కృషి చేసిన అందరికి అభినందనలని ఇదే స్ఫూర్తిని సర్పంచ్ ఎన్నికల వరకు కొనసాగించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం, స్వయం సహాయక సంఘాల బలోపేతంపై జిల్లా పంచాయతి, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో మంళవారం సచివాలయం నుంచి మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం నిర్వాహణలో జిల్లా స్థాయి అధికారుల నుంచి పారిశుద్య కార్మీకుల వరకు బాగా కష్టపడ్డారన్నారు. మంచి పనితీరు కనబరిచిన సిబ్బందికి ఆగస్టు 15న సన్మానిస్తామన్నారు. గతంలో పోలిస్తే ఎక్కువ పని జరిగిందని, మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్చదనంపై మరింత శ్రద్ద పెరగాలని, మండలాల వారిగా దీనిపై సమీక్షలు చేసి సమగ్ర నివేదికలివ్వాలని అధికారులను కోరారు.
ఇక నుంచి ప్రతి నెలా మూడు రోజుల పాటు స్వచ్చదనం-పచ్చదనం డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. పాములతో ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నందున గురుకుల పాఠశాలలు, హాస్టల్స్, కార్యాలయాలు సహా పబ్లిక్ ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు పొదలు తొలగించాలన్నారు. పారిశుధ్యం మీద దృష్టి సారించాలని సూచించారు. పారిశుద్య లోపాలపై వార్తలు వస్తే స్పందించి చర్యలు తీసుకోవాలని, తప్పుడు వార్తలు వస్తే అధికారులు ప్రజలకు వాస్తవాలు తెలపాలని, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోండన్నారు. సర్పంచ్ ఎన్నికల వరకు అధికారులు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలన్నారు.
పంచాయతీ స్పెషల్ అధికారులు ఉదయం కనీసం మూడు గంటల పాటు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రతి రోజు సిబ్బంది అంటెండెన్స్, చేసిన పనుల వివరాలను నివేదించాలని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరో జత యూనిఫాంలు సిద్దం చేసి పంపిణి చేయాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యత్వాన్ని కోటి మందికి చేర్చాలని, మహిళా శక్తి ప్రోగ్రాంలో ఎస్సీ, ఎస్టీ మహిళల భాగస్వామ్యం పెంచాలని, అధికారులు ఆవాస గ్రామాల్లో పర్యటించి మహిళాశక్తిలో చేర్చించాలని ఆదేశించారు.