Site icon vidhaatha

Ponnam Prabhakar | గురుకుల విద్యార్థిని మృతిపై విచారణకు మంత్రుల ఆదేశాలు.. అనుమానాస్పద మరణంపై కుటుంబ సభ్యుల ఆందోళన

విధాత, హదరాబాద్‌ : పెన్‌పహాడ్ మండలం దోసపాడు గ్రామంలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని సరస్వతి మృతిపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతి తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చిన్నారి మృతి పట్ల పొన్నం సంతాపం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సరస్వతి మృతికి గల కారణాలపై విచారణ చేయాలని గురుకుల పాఠశాలల సెక్రటరీ సైదులుని మంత్రి పొన్నం ఆదేశించారు. బాధిత కుటుంబంలో ఒకరికి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలో ఉద్యోగాన్ని కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం బాధిక కుటుంబానికి అండగా నిలిచారు. తక్షణ సాయం కింద వారికి రూ.2లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. సరస్వతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు దోసపాడు బీసీ గురుకులంలో సరస్వతి అనుమానాస్పద మృతికి సిబ్బందే కారణమంటూ సూర్యాపేట జిల్లా ఆస్పత్రి వద్ద కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. గురుకులం సిబ్బంది, ఆర్సీవో షకీనా, ప్రిన్సిపల్ విజయలక్మిపై మృతురాలి బంధువులు దాడి చేశారు. దీంతో సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక బాధితురాలి స్వగ్రామం నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. కుమార్తె మృతిపై సోమయ్య, నవ్య దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హాస్టల్‌ సిబ్బంది మాత్రం మంగళవారం ఉదయం తీవ్ర జ్వరం రావడంతో తాము విద్యార్థిని సరస్వతిని ఆస్పత్రికి తరలించగా.. ఆ లోపే ఆమె చనిపోయినట్లు చెబుతున్నారు. జ్వరం వచ్చిన విషయాన్ని కూడా ఉదయం ఏడు గంటలకే విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు చెప్తున్నారు. కానీ హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె చనిపోయినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Exit mobile version