-
- – కేటీఆర్ టార్గెట్‌గా కవిత విమర్శలు
- – ఇగ్నోర్ చేస్తున్న అధినేత కేసీఆర్
- – ‘కవిత దారెటు’ .. జోరుగా చర్చలు
- – ఆమె వెంట వెళ్లేందుకే నేతల వెనకడుగు
- – ప్రస్తుతం బీఆర్ఎస్ కు అనుకూల వాతావరణం
- – కొత్తపార్టీని కేసీఆర్ కూతురు నడిపించగలదా?
- – గతంలో అనుచరులను గెలిపించుకోలేక సతమతం
- – రాజకీయ శక్తిగా ఎదగాలని కవిత దూకుడు
- – కొత్త రాజకీయ వేదిక దిశగానే అడుగులు..
టార్గెట్ కేటీఆర్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లొచ్చిన ఆ తర్వాత తండ్రి ఆదేశాల మేరకు కొంత కాలం మౌనంగా ఉన్నప్పటీ తాజాగా తన అసంతృప్తిని బయట పెట్టారు. ఆమె రాసిన లేఖ బహిర్గతం కావడం, దేవుడి చుట్టూ దయ్యాలు చేరాయని చేసిన వ్యాఖ్యలతో అన్నా చెల్లెళ్ల మధ్య దూరం పెరిగిందన్న చర్చ మొదలైంది. తాజాగా స్వరం పెంచిన కవిత పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఆరోపించడంతో ఈమె పార్టీతో తెగదెంపులు చేసుకుంటారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. అంతటితో ఆగకుండా కాస్తంత డొస్ పెంచి సొంత బిడ్డపై పెయిడ్ అర్టిస్టులతో తిట్టిస్తున్నారని తన తండ్రినే ప్రశ్నించారు కవిత. కోవర్టులు.. లేఖ లీక్ వీరులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేస్తూ పరోక్షంగా కేటీఆర్ నే టార్గెట్ చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వెలువడుతోంది.
కవిత వెనకాల వెళ్లే ఎమ్మెల్యేలేరి..
కవిత తన తండ్రి కేసీఆర్ తో తెగదెంపులకు సిద్దం అయినట్లు కనిపిస్తోందని భావిస్తున్న రాజకీయ పరిశీలకులు, సీనియర్ జర్నలిస్ట్‌లు నిజంగా కవిత వేరు పార్టీ పెడితే ఆమె వెంట ఎమ్మెల్యేలు వెళతారా? అన్నచర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్న కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. పరిపాలనలో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్ అయిందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రైతాంగంలో ఈ వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తోంది. క్రమంగా బీఆరెస్ పార్టీనే నయం అన్న చర్చ కూడా గ్రామ స్థాయిలో మొదలైంది. బీఆరెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న నమ్మకం కుదరడంతో మొదట్లో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దమైన కొంత మంది బీఆరె ఎస్ ఎమ్మెల్యేలు కామ్‌గా ఉన్నారు. దీంతో పార్టీ ఫిరాయింపులు ఆగిపోయాయి. పార్టీ మారిన కొంత మంది ఎమ్మెల్యేలు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆరే మా నాయకుడంటూ మాట్లాడుతుండడం గమనార్హం. వరంగల్‌లో బీఆరెస్ పార్టీ నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో పార్టీ క్యాడర్ మంచి ఊపులో ఉన్నది. వచ్చే ఎన్నికల్లో బీఆరెస్ అధికారంలోకి వస్తుందన్ననమ్మకం ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఏర్పడింది. దీంతో ప్రస్తుత పరిస్థితిలో కవిత వెనకాల వెళ్లడం అంటే గోదారి ఈదినట్లే ఉంటుందని పార్టీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయ పడ్డారు.
గెలిపించే శక్తి ఉందా?
ఎమ్మెల్సీ కవిత తెగదెంపులు చేసుకొని బీఆరెస్ నుంచి బయటకు వెళ్లి కొత్త పార్టీ పెడితే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే శక్తి ఉందా? అన్న చర్చ కూడా జరుగుతోంది. ఆమె కారణంగానే నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ దెబ్బతిన్నదని, ఓటమి పాలైందని రాజకీయ పరిశీలకుడొకరు అభిప్రాయ పడ్డారు. అదే విధంగా సింగరేణి కార్మిక నాయకు రాలిగా ఉన్న కవిత సింగరేణి కార్మికుల ప్రభావం ఉన్న నియోజకవర్గాలలో 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి రెండు మినహా మెజార్టీ నియోజక వర్గాలలో బీఆరెస్ గెలువ లేదని అంటున్నారు. 2023 ఎన్నికల్లో ఒక్క ఆసిఫాబాద్ మినహా సింగరేణి కార్మికుల ప్రభావం ఉన్న ఏ ఒక్క నియోజక వర్గంలో బీఆరెస్ గెలువలేదు. చివరకు సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కూడా గెలువ లేదని చెపుతున్నారు. తన ప్రభావంలో ఉన్ననియోజకవర్గాలలోనే కేసీఆర్ హవా కొనసాగుతున్న సమయంలోనే అభ్యర్థులను గెలిపించుకోలేక పోయిన ఆమె సొంత పార్టీ పెడితే అభ్యర్థులను గెలిపించగలదా? అని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు. అయితే కవిత వ్యవహారం సాగతీత కంటే ఇప్పుడే తాడో పేడో తేలిపోతుందన్న అభిప్రాయంతో కొంత మంది ఎమ్మెల్యేలు సహా మెజార్టీ సెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. కవిత తెగదెంపులకే సిద్ధమైనట్టు కనిపిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది.
కేసీఆర్ కవిత డిమాండ్లకు తలొగ్గుతారా?
కేటీఆర్ టార్గెట్‌గా విమర్శలు సంధిస్తున్నకవిత వ్యవహార శైలిపై బీఆరెస్ అధినేత, తండ్రి కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నారు. కవిత ఇంకా ఎంత దూరం వెళుతుందో చూద్దాం అన్నతీరుగా ఉన్నట్లుగా కేసీఆర్ ను దగ్గరి నుంచి చూస్తున్న వాళ్లు అంటున్నారు. అయితే కవిత తక్షణమే హామీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, కేసీఆర్ ఇలాంటి వాటికి తలొగ్గే రకం కాదని అంటున్నారు. అయితే తక్షణ హామీలు రాకపోతే ఆమె పార్టీలో ఉండే అవకాశాలు కూడా లేవన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురుగానే కాకుండా రాజకీయంగా ఒక ఫోర్స్‌గా ఎదగాలన్నఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అన్నారు. ఆమె అడుగులు, మాటల తీరు పరిశీలిస్తే అలానే అనిపిస్తోందని అన్నారు. ఇప్పటికే ఆమె బయటకు వెళ్లి పార్టీ పెడుతుందనే ప్రచారం జరుగుతోందని చెపుతున్నారు.
మొదట్లో హరీశ్… తాజాగా కేటీఆర్
మొదటి దశలో కవిత పరోక్షంగా, తాజాగా డైరెక్ట్‌గా చేస్తున్న దాడి కేటీఆర్‌పైనే అన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. మొదట్లో హరీశ్‌రావు- కవిత మధ్య ప్రచ్చన్న యుద్దం జరిగింది. హరీశ్‌రావు తనపై సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాయిస్తున్నాడని కవిత తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. హరీశ్‌రావు తనను డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని కూడా బాధ పడినట్లు సమాచారం. అయితే సడన్‌గా కవిత తన ఫోకస్‌ను కేటీఆర్ మీద పెట్టిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.