Site icon vidhaatha

69వ వసంతంలోకి నాగార్జున సాగర్ డ్యాం

విధాత : కోట్లాది మంది గొంతు తడుపుతూ, కడుపు నింపుతూ…ప్రతీ ఇంట విద్యుత్ కాంతులు వెదజల్లుతూ….బీడు భూములకు జీవం పోసి బంగారు భూములుగా మారుస్తూ…నవ నాగరికతకు నిలయమై, అందరికీ ఆరాధ్యమై, ఆధునిక ఆలయమై విలసిల్లుతోంది మన బహుళార్థకసాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్. ప్రపంచంలోనే మానవ నిర్మిత మహాద్భుతంగా, భారతీయ ఇంజినీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా పేరొందిన సాగర్ ప్రాజెక్టుకు పునాదిరాయి వేసి సరిగ్గా నేటికి 68 వసంతాలు పూర్తిచేసుకుని 69వ వసంతంలోకి అడుగుతుంది. 1955 డిసెంబర్ 10న నాటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ డ్యాంపై ప్రత్యేక కథనం.

ప్రధాని నెహ్రు చేతుల మీదుగా శంకుస్థాపన

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టుగా నాగార్జున సాగర్ ప్రసిద్ధి చెందింది. భారత ఇంజనీర్ల స్వయం సాంకేతిక పరిజ్ఞానానికి, కృష్ణానదిపై నిర్మించబడిన తొలి జాతీయ ప్రాజెక్టు. ప్రతిభ, మేధాసంపత్తికి నిదర్శనంగా, భావితరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 1955 డిసెంబర్ 10వతేదీన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నవభారత నిర్మాత, భారత తొలిప్రధాని పండిట్ జనహర్ లాల్ నెహ్రు శంకుస్థాపన చేసిన సందర్భంలో ‘ఆధునిక దేవాలయంగా’ నాగార్జున సాగర్ ను అభివర్ణించారు. ధాన్యాగారంగా విరాజిల్లి, ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, గ్రామీణ ఆర్థిక, సాంస్కృతిక వికాసానికి తోడ్పడింది. వ్యవసాయాభివృద్ధికి, దాని ద్వారా గ్రామీణ ఆర్ధిక వికాసానికి సాగర్ జలాశయంతో బీజం పడింది.




 


చారిత్రాక ప్రాంతంలో సాగర్ నిర్మాణం

నాగార్జున కొండ ప్రాంతంలో ఒకనాడు నెలకొన్న విజయపురి పట్టణం జలాశయంలో అంతర్భాగమైనప్పటికీ నేడు చారిత్రిక, ఆధ్యాత్మిక, వ్యవసాయం, పారిశ్రామిక కేంద్రంగా ఉపయోగపడుతోంది. కరుణా సముద్రుడైన బుద్ధభగవానుని సందేశం విశ్వవ్యాప్తం కావటానికి ఆచార్య నాగార్జునుడి బోధనలతో ఈ ప్రాంతం దోహదపడితే, జలాశయం నిర్మాణం తర్వాత అన్ని రంగాలలోనూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, ప్రజల జీవనాన్ని సుఖసంతోషాలమయం చేయటం నాగార్జునసాగర్ ప్రాజెక్టు వల్ల వీలయ్యింది. సాగర్ నిర్మాణం కోసం జరిగిన త్రవ్వకాల్లో అనేక బౌద్ద చరిత్ర ఆనవాళ్లు, దేవాలయాలు, విగ్రహాలు వెలుగుచూడగా వాటిని సాగర్ కొండపై మ్యూజియంలో కొలువుతీర్చారు. ఆనకట్ట నిర్మాణంలో 1వ మరియు 2వ శతాబ్దాలలో ఇక్ష్వాకు రాజవంశం మరియు తూర్పు దక్కన్‌లోని శాతవాహనుల వారసుల రాజధానిగా ఉన్న నాగార్జునకొండ పురాతన బౌద్ధ స్థావరం మునిగిపోయింది. త్రవ్వకాల్లో 30 బౌద్ధ విహారాలు అలాగే చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కళాఖండాలు, శాసనాలు లభించాయి. వాటిని ఇప్పుడు జలాశయం మధ్యలో దీవిగా ఉన్న నాగార్జునకొండ మ్యూజియంకు తరలించారు. మరికొందరిని సమీపంలోని ప్రధాన భూభాగమైన అనుపు గ్రామానికి తరలించారు.

ఆనాటి ఆలోచన..నేటీ సాగర్ జలాశయం

1900 సంవత్సరం నుంచి కృష్ణానదిపై జలాశయాలు కట్టాలనే ఆలోచన నాటి బ్రిటిష్ పాలకులకు కలిగింది. కృష్ణా జలాలు సద్వినియోగం చేసుకోవాలని తొలి నుంచి జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన ముక్త్యాల రాజా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆకలి చావులు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆహారోత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలని స్వాతంత్ర్యం సిద్ధించాక నవభారత నిర్మాత, తొలి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు నిర్ణయించారు. ఇందుకోసం సాగునీటి వసతులు కల్పించాలని భావించటంతో అందుకు తగిన విధంగా తొలి పంచవర్ష ప్రణాళిక నుంచే సాగునీటి పథకాలు, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే దక్షిణాదిన నాగార్జునసాగర్ కు శ్రీకారం చుట్టారు. నాగార్జున సాగర్ డ్యామ్ అనేది ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మరియు తెలంగాణలోని నల్గొండ జిల్లాల మధ్య సరిహద్దులో ఉన్న నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నదికి అడ్డంగా నిర్మించబడిన రాతి ఆనకట్ట. పల్నాడు , గుంటూరు , నల్గొండ , ప్రకాశం , ఖమ్మం , కృష్ణా , మరియు పశ్చిమ గోదావరిలోని పలు జిల్లాలకు సాగునీటిని అందిస్తుంది ఇది జాతీయ గ్రిడ్‌కు విద్యుత్ ఉత్పత్తికి కూడా మూలం. కుడి కాలువ విద్యుత్తు కేంద్రం ద్వారా 90యూనిట్లు, ఎడమ కాలువ ద్వారా 60యూనిట్లు విద్యుత్తు, మెయిన్‌ పవర్‌ హౌజర్‌ నుంచి 815మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది.



 


1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరణతో ముందడుగు

1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించాక సాగర్ నిర్మించేందుకుగాను అధ్యయనం చేసేందుకు ఎల్. వెంకటకృష్ణ అయ్యర్, డీవీ రావుల ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. రెండేళ్ల తర్వాత 1955లో డిసెంబర్‌ 10న నాటి ప్రధాని నెహ్రు శంఖుస్థాపన చేశారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, సొంతగా ప్రణాళికా పెట్టుబడులు, కనీస యంత్రాల వినియోగంతో పూర్తి స్థాయిలో మానవ నిర్మిత జలాశయంగా 1956 ఫిబ్రవరిలో పనులు మొదలయ్యాయి. నాటి ఈ ప్రాజెక్టు నిర్మాణం నేటి జలయజ్ఞానికి స్ఫూర్తిగా ఉంటుందనటంలో సందేహంలేదు. ప్రధానంగా జలాశయం నిర్మాణ పనుల్లో రోజుకు కనీసం 50వేల మంది కార్మికులు పాలుపంచుకునే వారంటే ఎంత ఉదృతంగా పనులు జరిగాయో అంచనా వేసుకోవచ్చు. పూర్తిగా రాతికట్టగా పసులు ప్రారంభించారు. 1969లో జలాశయం పనులు పూర్తిచేశారు. 1967 ఆగస్టు 4న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఎడమ మరియు కుడి గట్టు కాలువలకు రిజర్వాయర్ నీటిని విడుదల చేశారు . జలవిద్యుత్ ప్లాంట్ నిర్మాణం తరువాత, 1978 మరియు 1985 మధ్య అదనపు యూనిట్లు సేవలోకి రావడంతో విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. 2015లో, ప్రాజెక్టు ప్రారంభోత్సవం యొక్క డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. 1974లో జలాశయానికి గేట్లు అమర్చటంతో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయటం అప్పటి నుంచి సాధ్యం అయ్యింది. 108 శతకోటి ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో 124.66 మీటర్ల ఎత్తు, 97.5 మీటర్ల వెడల్పుతో 26 క్రస్ట్ గేట్లు కలిగిన అతిపెద్ద మట్టి, రాతికట్ట జలాశయంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది.

22 లక్షల ఎకరాలకు సాగునీరు…

నాగార్జున సాగర్ వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలకు నీరందుతోంది, విద్యుత్ వెలుగులను అందిస్తున్నది, కోట్ల గొంతుకలను తడుపుతున్నది ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు. హైలెవల్‌, లోలెవల్‌ కెనాల్‌ ద్వారా మరిన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎఎమ్మార్పీ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా జంటనగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 600గ్రామాలకు తాగునీరు అందిస్తుంది. ఇది ఒక ప్రపంచ పర్యాటక కేంద్రం. ప్రాజెక్టును చూడటానికి ప్రపంచంలోని పర్యాటకులు వస్తుంటారు, వారికి తగు సమాచారం కల్పించే విధంగా ప్రాజెక్టు యంత్రాంగం, ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రాజెక్టు భవిష్యత్తులో పటిష్టంగా ఉండటానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వివరాలు :

రాతి కట్టడం పొడవు : 4756 అడుగులు

రాతి కట్టడం ఎత్తు: 409 అడుగులు

మొత్తం జలాశయం పొడవు: 1545 అడుగులు

స్పిల్ వే: 1545 అడుగుల పొడవు

26 క్రస్ట్ గేట్లు(ఒక్కొక్కటి45 x 44 అడుగులు)

డ్యాం పూర్తిస్థాయి నీటి నిలువ ఎత్తు: 590 అడుగులు

స్థూలంగా నీటి నిల్వ: 408.24 టీఎంసీలు..ప్రస్తుతం 312టీఎంసీలు

కనీస నీటి విడుదల మట్టం: 510 అడుగులు.

Exit mobile version