విధాత : అధిక వడ్డీ పేరుతో ఆశ చూపి.. రూ.50 కోట్ల మేర అమాయక ప్రజల వద్ద నుండి ఏజెంట్ల ద్వారా వసూలు చేసిన ఆర్థిక నేరగాడు బాలాజీ నాయక్ ను నల్లగొండ జిల్లా పోలీస్ అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపిన వివరాల మేరకు అమాయక గిరిజనుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన పీఏ పల్లి మండలం, పలుగుతండాలోని వద్దిపట్ల గ్రామానికి చెందిన రామవత్ బాలాజీ నాయక్.. 2019 సంవత్సరంలో డిగ్రీ లో ఫెయిల్ అయిన తరువాత 2020 సంవత్సరంలో ఐస్ క్రీమ్ పార్లర్ వ్యాపారం కొరకు బందువుల వద్ద 5 లక్షల రూపాయలు రూ.2 వడ్డీతో తీసుకొని వ్యాపారంలో నష్ట పోయాడు. తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకోగా.. 2 రూపాయల వడ్డీకి డబ్బులు దొరకలేదు. దీంతో 6 రూపాయల వడ్డీ ఇస్తానని ఆశ చూపి నమ్మించి.. అదే గ్రామానికి చెందిన వారి నుంచి 10 లక్షలు ఒకరి వద్ద, 5 లక్షలు మరొకరి వద్ద తీసుకొని వడ్డీ చెల్లిస్తూ నమ్మించాడు.
దీంతో పలుగు తండా, పుట్టనగండి తండా, గడ్డమీది తండా, చింతల్ తండా, నక్కల పేట తండా,పావురాల గట్టు, వద్దిపట్ల గ్రామాలు, చుట్టుపక్కల గిరిజన తండాలు, గ్రామాల నుండి మరికొంత మంది అధిక వడ్డీకి ఆశపడి బాలాజీ నాయక్ కు డబ్బులు ఇచ్చారు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని అధిక వడ్డీ ఇస్తానని ఆశ పెట్టి వీరి వద్ద డబ్బులు తీసుకొని వారికి ప్రామిసరీ నోట్లు వ్రాసి ఇచ్చి నెలకు 10 రూపాయల వడ్డీ చెల్లించేవాడు. బాలాజీ నాయక్ తన విలాసవంతమైన జీవన శైలిని ఖరిదైన కార్లు, విల్లాలు కొనుగోలు చేసి జనాల నమ్మించాడు. బ్యాంక్ లో వచ్చే వడ్డీ కంటే పది రేట్లు ఎక్కువ వడ్డీ ఇవ్వడం తో జనాలు ఆకర్షితులై బాలాజీ నాయక్ కి అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చారు.
పెట్టుబడులతో నష్టంతో మోసం బట్టబయలు
ఇలా వచ్చిన కోట్ల డబ్బులతో వైన్స్ షాప్ పర్మిషన్ ల కోసం సుమారు 2.3 కోట్లు, స్టాక్ మార్కెట్ లో, ఆన్ లైన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన బాలాజీ నాయక్ నష్ట పోయాడు. గత కొన్ని నెలలుగా బాదితులకు అసలు, వడ్డీ డబ్బులు ఇవ్వలేక పోయే సరికి బాధితులు బాలాజీ నాయక్ పై వత్తిడి చేయడం ప్రారంభించారు. భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వలేక బాలాజీ నాయక్ బాధితుల నుండి తప్పిచ్చుకొని పారిపోయాడు. ఇతని వద్ద నుండి పార్చునార్ కార్, స్కార్పియో కారు.. ఆస్తులకి సంబంధించిన పత్రాలు మిర్యాలగూడ, హయత్ నగర్, నేరేడుచర్ల, పలుగు తండా లో ఇల్లు, దామరచర్ల, వద్దిపట్లలో వ్యవసాయ భూమి సహా బాధితులకు వ్రాసి ఇచ్చిన ప్రామిసరీ నోట్లు 36, ఖాళీ ప్రామిసరీ నోట్లు 77, అలాగే 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు.