Nalgonda : వర్షం కాటు..తేమ వేటు..స్లాటుల పోటు..రైతన్నల అరిగోస !

వర్షాల వల్ల పంట నష్టం, తేమ కొర్రీలతో రైతుల ఆవేదన.. పత్తి, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతన్నల అరిగోసకు దారి తీసింది.

Nalgonda farmers protest over paddy procurement

విధాత : ఓ వైపు వదలకుండా నిత్యం పడుతున్న వర్షాలు..మరోవైపు తడిసిన ధాన్యం, పత్తి కొనుగోలులో తేమ నిబంధనల కొర్రీలతో రైతాంగం అరిగోస పడుతుంది. పొలాల్లో తడిసిపోతున్న పంటలను నానా తిప్పలు పడి కొనుగోలు కేంద్రాలకు చేర్చితే తేమ శాతం సాకులతో కొనడానికి నిరాకరిస్తున్న అధికారుల తీరుపై రైతాంగం రగిలిపోతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కళ్లాల్లో పోసిన ధాన్యం నెల రోజులైన కొనుగోలు చేయని దుస్ధితితో ఇప్పటికే ధాన్యం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పత్తి రైతులకు సీసీఐ పెడుతున్న తేమ కొర్రీలు మరింత సంకటంగా మారాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం యరగండ్లపల్లి లక్ష్మీ నరసింహ స్వామి అగ్రో పత్తి మిల్లు వద్ద రైతులు పత్తి కొనుగోలు చేయడం లేదని మిల్లు యజమానులపై రైతులు ఆందోళనకు దిగారు. ట్రాక్టర్ కిరాయితో పత్తి తీసుకొచ్చానని, వర్షం పడితే తన బ్రతుకు ఆగమైపోతుందని ధర తక్కువైనా పత్తిని కొనుగోలు చేయాలని ఓ రైతు జిల్లా కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్నా కొనుగోలు ప్రక్రియలో మార్పు రాలేదు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వచ్చి..సీసీఐ అధికారులకు చెప్పినప్పటికి తేమ పేరుతో పత్తి కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ పత్తి రైతులు మంగళవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రోడ్డుపై రైతన్నలు చేస్తున్న ధర్నాతో మాల్ నుండి మర్రిగూడ కు వెళ్లే ప్రధాన రహదారి ట్రాఫిక్ జామ్ అయింది.

స్లాట్ బుకింగ్ తిప్పలు..తేమ కొర్రీలు

ఆరుగాలం కష్టించి..ప్రతికూల ప్రకృతికి ఎదురీత సాగించి పండించిన పత్తి పంటను అకాల వర్షం దెబ్బతీయగా మిగిలిన పంటను అమ్ముకుందామంటే వీలు లేకుండా సీసీఐ కొర్రీలు పెడుతుందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు స్లాట్ ల బుకింగ్ తంటా మరొకవైపు మ్యాచర్(తేమ) నిబంధనలతో పత్తి కొనుగోలు జరుగని పరిస్థితి ఉందని రైతులు ముకుమ్మడిగా ఆందోళన బాట పట్టారు. తమకు నచ్చిన వాహనాలను అనుమతిస్తూ మిగతా వాటిని గాలికి వదిలేస్తున్నట్లు వాళ్లు ధ్వజమెత్తారు. ఎంతో వ్యయప్రయాసాలకు పత్తి పంటను తీసుకొస్తే తేమ పేరుతో కొనుగోలుకు నిరాకరించడంతో తాము ట్రాక్టర్ల కిరాయి కూడా నష్టపోతూ మరిన్ని ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నామని రైతన్నలు వాపోతున్నారు. కొన్న పత్తికి కూడా పత్తి మిల్లు యజమానులు సరైన మద్దతు ధర ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.