అడుగంటిన కృష్ణా ప్రాజెక్టులు, వరదల రాకకై రైతాంగం ఎదురుచూపులు … బాబ్లీ గేట్ల ఎత్తివేత

వర్షాకాలం మొదలైనా ఇప్పటిదాకా భారీ వర్షాలు..వరదల ఉదృతి లేకపోవడంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు జలకళకు దూరమై అడుగంటిపోతుండగా, క్రమంగా గోదావరి ప్రాజెక్టులకు ఎగువ రాష్ట్రాల నుంచి వరదల రాక సాగుతూ ఆయకట్టు రైతాంగంలో పంటల సాగుపై ఆశలు నిలబెడుతున్నాయి

  • Publish Date - July 2, 2024 / 01:25 PM IST

విధాత : వర్షాకాలం మొదలైనా ఇప్పటిదాకా భారీ వర్షాలు..వరదల ఉదృతి లేకపోవడంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు జలకళకు దూరమై అడుగంటిపోతుండగా, క్రమంగా గోదావరి ప్రాజెక్టులకు ఎగువ రాష్ట్రాల నుంచి వరదల రాక సాగుతూ ఆయకట్టు రైతాంగంలో పంటల సాగుపై ఆశలు నిలబెడుతున్నాయి. కృష్ణా నదికి ఎగువన కర్నాటకలో భారీ వర్షాలు పడకపోవడంతో ఆల్మట్టి మొదలుకుని నారాయణపూర్‌, ఉజ్జయిని, తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ వరకు అన్ని రిజర్వాయర్‌లు అడుగంటి జలకళ కరువై వెలవెలబోతున్నాయి. ఆ ప్రాజెక్టులన్ని కూడా డెడ్ స్టోరేజీకి చేరుకోగా, ప్రస్తుత నీటి నిల్వలు అతికష్టంగా జూలై చివరి వారం తాగునీటి అవసరాలు తీరుస్తాయంటున్నారు అధికారులు. గతేడాది సైతం కృష్ణా బేసిన్‌లో లోటు వర్షాపాతం నమోదైంది. కృష్ణా నది పరివాహక ఎగువన ప్రాజెక్టులు నిండిన సందర్భాల్లో వదిలిన నీటితో తెలంగాణలోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్‌ల కింద ఆయకట్టుకు వారబందీ పద్ధతిలో నీటి విడుదల చేశారు. వేసవిలో ఆ ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజీతో తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కర్నాటక ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి మే నెలలో ఒకటిన్నర టీఎంసీల నీటి విడుదలతో కొంత తాగునీటి సమస్యను అధిగమించింది. అయితే జూలై మొదటి వారం వచ్చిన నేపథ్యంలో భారీ వర్షాలు పడకపోతే కృష్ణా బేసిన్ రిజర్వాయర్‌ల కింద సాగునీటి సంగతేమోగాని తాగునీటి సమస్యలు జఠిలమయ్యే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముంది. మరోవైపు వర్షాలు పడకపోతాయా అన్న ఆశతో కృష్ణా రిజర్వాయర్ పరిధిలోని రైతులు నార్లు పోసుకుంటున్నారు. రాష్ట్రంలో కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల కింద 35లక్షలకు పైగా ఎకరాల పంటలు సాగవుతున్నాయి. గతేడాది సరైన వర్షాలు లేక రైతులు పంటల సాగు తగ్గించుకున్నారు. ప్రస్తుతం అల్మట్టిలో రిజర్వాయర్‌లో 129.72టీఎంసీలకుగాను 35.02టీఎంసీలు, తుంగభద్రలో 105.79టీఎంసీలకు 5.28టీఎంసీలు, ఉజ్జయినిలో 117.24టీఎంసీలకుగాను 40.97టీఎంసీలు, నారాయణపూర్‌లో 37.64టీఎంసీలకుగాను 25.06టీఎంసీలు, జూరాలలో 9.66టీఎంసీలకు 7.97టీఎంసీలు, శ్రీశైలంలో 215.81టీఎంసీలకు 37.46టీఎంసీలు, నాగార్జున సాగర్‌లో 312.05టీఎంసీలకు 122.03టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. పోయిన వర్షాకాలం ఆగస్టు వరకు కూడా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులలో వర్షాభావంతో వరదలు రాని నేపథ్యంలో శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్‌లు నిండటానికి 270టీఎంసీల నీటీ కొరతను ఎదుర్కోన్నాయి.

భవిష్యత్తు వర్షాలపైనే రైతుల ఆశలు

ఇప్పటిదాకా సరైన వర్షాలు లేక అల్మట్టి నుంచి సాగర్ వరకు అన్ని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీలో పడిపోయాయి. అల్మట్టి, నారాయణపూర్‌, ఉజ్జయిని, తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు నిండటానికి 654టీఎంసీలు అవసరంకాగా, అందులో జూరాల, శ్రీశైలం, సాగర్‌లకు 370కిపైగా టీఎంసీలు అవసరం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో మంచి వర్షాలు పడిన పక్షంలో ఆలస్యంగానైనా ఆయా ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటాయి. నాగార్జున సాగర్ ఆయకట్టులో ఏటా జూన్ 15నుంచి నీటి విడుదల చేయాలన్న గెజిట్ ఉన్నప్పటికి కొన్నేళ్లుగా ఆగస్టు, సెప్టెంబర్‌లలోనే ఎక్కువగా నీటి విడుదల సాగుతుంది. ఈ దఫా వర్షాపాతం సాధారణంతో పోల్చితే మెరుగ్గా ఉంటుందన్న సూచనల నేపథ్యంలో వెనుకాముందు వర్షాలు పడకపోతాయా అన్న ఆశలతో రైతాంగం సాగు పనుల్లో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు వర్షాలపైనే ఆయకట్టు రైతులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఎస్సారెస్పీకి వరద రాక

ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరదనీరు రాక పెరుగుతూ వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎస్సారెస్పీలోకి వరద నీరు వస్తుంది. ప్రాణహిత నది ప్రవాహం పెరిగి పోగా, మేడిగడ్డ వద్ద 13వేల క్యూసెక్కుల చొప్పున దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీకి రెండు రోజులుగా 3000నుంచి 3,500వేల క్యూసెక్కుల చొప్పున వరద వస్తుండగా, ప్రాజెక్టు పూర్తి స్తాయి నీటి మట్టం 80.50టీఎంసీలుగా ఉండగా, 10.05టీఎంఎసీలకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి 15.88టీఎంసీల నీటి నిల్వ ఉంది. గోదావరి పరివాహకంలో ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో ఆయకట్టులోని 12.50లక్షల ఎకరాల మేరకు పంటల సాగుపై రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఎస్సారెస్పీ ఎగువన తగినంత వర్షాలు పడని పక్షంలో , దిగువన వర్షాలు పడి ఎల్లంపల్లిలోకి వరద వస్తే ఎత్తిపోతలతో నంది, గాయాత్రి పంపుహౌజ్‌ల ద్వారా మధ్యమానేరు, దిగువ మానేరు జలాశయాలను నింపడంతో ఎస్సారెస్పీలోకి ఎత్తిపోసే అవకాశముంది.

మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సోమవారం ఉదయం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో గేట్లను ఎత్తివేశారు. జులై ఒకటో తేదీ నుండి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి ఉంటాయని ఎస్సారెస్సీ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ప్రాజెక్టు 14 గేట్లను వరుస క్రమంలో సాయంత్రం వరకు ఎత్తుతామని అన్నారు. దీంతో గేట్ల విడుదలతో ఎగువన ఉన్న 0.2 టీఎంసీల నీళ్లు దిగువకు ప్రవహిస్తుందన్నారు. మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏడాది జూలై 1న గేట్లు ఎత్తడం అనవాయితీగా వస్తుంది. మహారాష్ట్రలో బాబ్లిగేట్లు ఎత్తడం వలన శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు రానుంది. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా, సిడబ్ల్యూసీ ఈఈ వెంకటేశ్వర్లు, ఈఈ చక్రపాణి, నాందేడ్ ఈఈ బాన్సద్, ఏఈఈ వంశీ, ఎస్టీఈ సతీష్ లు ఉన్నారు.

Latest News