రైతుల అకౌంట్లలో పీఎం కిసాన్ డబ్బులు.. రైతుబంధుకు ముహుర్తం ఎప్పుడో

  • Publish Date - November 15, 2023 / 02:56 PM IST

విధాత : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగుతుండగానే కేంద్రం పీఎం కిసాన్ డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేసింది. 15వ విడత పీఎం కిసాన్ నిధులు 18వేల కోట్లను సుమారుగా 8కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో వేశారు. ఏటా మూడు విడతలుగా రైతులకు కేంద్రం ఆరువేలు పీఎం కిసాన్ కింద సహాయం అందిస్తుంది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగిసి ఒకే విడతలో ఈనెల 17న 230 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. చత్తీస్‌ఘడ్‌లో రెండో దశ 70స్థానాలకు అదే రోజు పోలింగ్ జరుగనుంది. తొలి దశ నవంబర్ 7న 20స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఇక రాజస్థాన్‌లో నవంబర్ 25న 200 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. మిజోరాంలో 40స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ ముగిసింది.


ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరుగాల్సివుంది. మిజోరాం మినహా చత్తీస్ ఘడ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, తెలంగాణలలో పోలింగ్ జరుగాల్సి వుండగా కేంద్రం పీఎం కిసాన్ నిధులను రైతులకు అందించడం బీజేపీకి కలిసివస్తుందో లేదో వేచి చూడాల్సివుంది. అటు తెలంగాణ ప్రభుత్వం సైతం రైతు బంధు రెండో పంట సహాయాన్ని అందించాల్సివుంది. ఇప్పటికే ఏపీలో వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అక్కడ రైతుబంధు సహాయాన్ని ఇటీవలే రైతుల ఖాతాల్లో జమ చేసింది. కాగా తెలంగాణలో సీఎం కేసీఆర్ బీఆరెస్ ప్రభుత్వం గత 2018అసెంబ్లీ ఎన్నికల తరహాలో పోలింగ్ కు ముందు రైతుబంధు ఆర్ధిక సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని చూస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


ఎన్నికల సంఘం దీనిపై ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తికరం. అయితే పీఎం కిసాన్ తరహాలోనే రైతుబంధు నిధుల జమ కూడా జరిగిపోవచ్చని భావిస్తున్నారు. ఈ పరిణామం తెలంగాణలో అధికార బీఆరెస్‌కు ఎంత మేరకు లబ్ధి చేకూర్చనుందో పోలింగ్‌లోనే తేలనుంది. ప్రస్తుతం బీఆరెస్ ప్రభుత్వం ఎకరాకు 5వేలు అందిస్తుండగా, కాంగ్రెస్ గెలిస్తే ప్రతి రైతుకు ఏటా 15వేలు, రైతు కూలీలకు 12వేలు ఇస్తామంటుంది.