Speed Post | హైదరాబాద్ : ఇండియన్ పోస్టాఫీసు( Indian Post office ) స్పీడ్ పోస్టు సేవల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక అక్టోబర్ 1వ తేదీ నుంచి స్పీడ్ పోస్టు( Speed Post ) డెలివరీల్లో ఈ కీలక మార్పు అమలు కానుంది. అదేంటంటే.. ఇప్పటి వరకు స్పీడ్ పోస్ట్ డెలివరీ సమయంలో సదరు వ్యక్తి సంతకం( Signature ) తీసుకున్న తర్వాతనే పార్శిల్‌ను డెలివరీ చేసేవారు. కానీ ఇక నుంచి సంతకం స్థానంలో వన్ టైమ్ పాస్ వర్డ్( One Time Password ) తప్పనిసరి కానుంది. పార్శిల్‌ను అందుకునే వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ( OTP ) వస్తుంది. ఆ ఓటీపీ చెప్పిన తర్వాతనే పార్శిల్‌ను అందజేయనున్నారు పోస్టాఫీస్ సిబ్బంది.
ఈ క్రమంలో తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లోని 6 వేలకు పైగా పోస్టాఫీసుల్లో ఈ కొత్త విధానం అక్టోబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. భద్రత, విశ్వసనీయత, కస్టమర్ సౌలభ్యం కోసమే సంతకం స్థానంలో ఓటీపీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీని వల్ల ఫ్రాడ్ జరిగే అవకాశం లేదన్నారు. సంబంధిత పార్శిల్.. అదే వ్యక్తికే తప్పకుండా చేరుకునే అవకాశం ఉందన్నారు.
13 ఏండ్ల విరామం తర్వాత కొత్త టారిఫ్ రేట్లు..
13 ఏండ్ల విరామం తర్వాత కొత్త టారిఫ్ రేట్లను అమలు చేయనున్నారు. చివరిసారిగా 2012లో ధరలను సవరించారు. కొత్త టారిఫ్ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త టారిఫ్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
50 గ్రాముల వరకు రూ. 19
50 నుంచి 250 గ్రాముల వరకు రూ. 24
250 నుంచి 500 గ్రాముల వరకు రూ. 28గా నిర్ణయించారు.
అలాగే సుదూర ప్రాంతాలకు(200 నుంచి 2 వేల కిలోమీటర్ల వరకు) 50 గ్రాముల వరకు రూ. 47 వరకు వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక స్పీడ్ పోస్టు సేవలకు జీఎస్టీ వర్తించనుంది. అయితే విద్యార్థుల సౌలభ్యం కోసం స్పీడ్ పోస్టు టారిఫ్‌పై 10 శాతం తగ్గింపును ప్రకటించింది.